స్వర్ణాంధ్ర సాధనలో  మోడీ కూడా భాగస్వామే!

ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు తీసుకున్న నారా చంద్రబాబునాయుడు.. స్వర్ణాంధ్రప్రదేశ్ అనే స్వప్నాన్ని తన హయాంలోనే సాకారం చేసి తెలుగు ప్రజలకు కానుకగా అందించాలనే కృతనిశ్చయంతో పనిచేస్తున్నారు. ఎటూ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు నడుస్తోంది. రాష్ట్రం, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉండడం వలన.. ఉండే ఎడ్వాంటేజీలు ఎంటూ ఉంటాయి. వాటన్నింటితో పాటూ తన స్వప్నం స్వర్ణాంధ్రను సాకారం చేయడంలో కూడా ప్రధాని మోడీని నేరుగా భాగస్వామిని చేస్తూ చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. రాష్ట్రం దశదిశ మార్చే పనిలో ఉన్నారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడు.. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ గురించి ప్రధానికి వివరించారు. రాష్ట్రం సుస్థిర సర్వతోముఖ అభివృద్ధి సాధించడంలో అయిదేళ్లు జగన్ పాలన ఏ రకంగా శాపంగా మారిందో కూడా చంద్రబాబునాయుడు ప్రధాని మోడీకి వివరించి చెప్పారు. రాష్ట్రానికి కేంద్రంనుంచి రావాల్సిన సహకారం మొత్తం పూర్తిస్థాయిలో రాబట్టేందుకు ఆయన కసరత్తు  చేస్తున్నారు.గత అయిదేళ్లలో కేంద్ర పథకాలకు మ్యాచింగ్ గ్రాంటు కూడా కేంద్రంనుంచి  రాలేదనే సంగతిని చంద్రబాబు ఢిల్లీ టూర్ ఎజెండాలో పెట్టుకోవడం విశేషం.

చంద్రబాబునాయుడు పూనికతో అమరావతి, పోలవరం, రైల్వేజోన్ పనులు త్వరగానే ప్రారంభం కాబోతున్నాయి. అమరావతి పనులు డిసెంబరులో మొదలవుతాయని చంద్రబాబు ఢిల్లీలో ప్రకటించారు. అలాగే డిసెంబరులోనే రైల్వేజోన్ ప్రధాన కార్యాలయానికి కూడా శంకుస్థాపన జరగబోతోంది. ఆ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ కూడా పాల్గొంటున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఆల్రెడీ 2800 కోట్లు మంజూరు చేసేసింది.

తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా గుర్తింపుతో ఉంది. ఆ రకంగా ఎన్డీయే సర్కారులో తనకు ఉండే ప్రాధాన్యాన్ని, విలువను రాష్ట్ర ప్రయోజనాలకోసం చంద్రబాబునాయుడు వాడుకుంటున్నారు. ప్రధాని మోడీతో ఉండే సత్సంబంధాలను వాడుకోవడం ద్వారా.. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించాలని చూస్తున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రెవేటుపరం కాకుండా చూడడం కూడా చంద్రబాబునాయుడు బాధ్యతగా తీసుకుంటున్నారు. మొత్తానికి కేంద్రం సమన్వయంతో పడబోయే అడుగులు రాష్ట్ర ప్రజలకు కొత్త ఆశలు పుట్టిస్తున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories