కొందరు నాయకుల మధ్య కొన్ని విషయాల్లో సారూప్యతలు కనిపిస్తుంటాయి. కొందరు వేషభాషల్లోను, ప్రవర్తన తీరులోను, పేదల కోసం పథకాలను ఆలోచించే క్రమంలోనూ ఇలాంటి పోలికలను గమనిస్తూ ఉంటారు. కానీ.. చంద్రబాబునాయుడు ఒక కొత్త కోణంలో తనకు- ప్రధాని నరేంద్రమోడీకి మధ్య ఉండే పోలికలను గురించి చెప్పారు. ఆయన ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల విషయం ప్రస్తావిస్తూ ఈ పోలిక చెప్పారు. ఈ ఇద్దరు నాయకుల మధ్య సామ్యం.. ఆహారం విషయంలో అదుపు పాటించడం మాత్రమే కాదు.. అనారోగ్యం పేరుతో ఇప్పటి దాకా ఒక్కరోజు కూడా తమ విధులకు సెలవుపెట్టకపోవడం కూడా. చంద్రబాబునాయుడు ఈ విషయాన్ని అసెంబ్లీలోనే ప్రకటించారు.
ఏపీ శాసనసభలో ప్రజారోగ్యం గురించి మంగళవారం ఉపయోగకరమైన చర్చ జరిగింది. తన ఆహారపు అలవాట్ల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చాలా అదుపులో ఉంటారని, మితాహారం తీసుకుంటారనే సంగతి చాలా మందికి తెలుసు. ఆ రకంగా నలుగురికీ సలహా చెప్పడానికి హక్కున్న చంద్రబాబు మంచి మాటలు చెప్పారు. ‘ఆహారమే ఔషధం.. వంటశాలే ఫార్మసీ’ అనే నియమాన్ని ప్రతి ఒక్కరూపాటించాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ తమ జీవన విధానాల్ని మార్చుకోవాలని, పంచదార, ఉప్పు, వంటనూనెలను వీలైనంత వరకు తగ్గించాలని అన్నారు. 8 గంటలు నిద్రపోవడం తప్పనిసరి అని కూడా చెప్పారు. ఈ సందర్భంగానే మాట్లాడుతూ.. అనారోగ్య కారణాలతో ప్రధాని మోడీ, తాను ఎప్పుడూ సెలవు పెట్టలేదని.. కావాల్సిన దానికంటె ఎక్కువ తినేయడం వల్లే.. అనారోగ్యాలు వస్తున్నాయని అన్నారు.
ఈ సందర్భంగా.. చంద్రబాబునాయుడు సభలోని తన సహచరుల మీద జోకులు వేసి అందరినీ నవ్వించారు. ‘మనిషి సగటు వయసు 120 ఏళ్లు.. కానీ 40 ఏళ్లలోనే 120 ఏళ్లకు తినాల్సిన ఆహారాన్ని మొత్తం తినేస్తున్నాం’ అని చెప్పిన చంద్రబాబు.. ‘అది మీకు కూడా వర్తిస్తుంది అధ్యక్షా’ అంటూ ఆ సమయానికి సభాపతి స్థానంలో ఉన్న రఘురామక్రిష్ణరాజును ఉద్దేశించి అన్నారు. సభ్యులతో సహా డిప్యూటీ స్పీకరు కూడా ఆ మాటలకు చిరునవ్వులు చిందించారు. రఘురామక్రిష్ణరాజు భోజనప్రియులు అన్న సంగతి ఆయనను ఎరిగిన వారికి తెలుసు. సీఎం ప్రసంగం తర్వాత రఘురామ మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఇచ్చిన సూచనల్ని మా అచ్చెన్నాయుడు, నేను ఇద్దరమూ తప్పక పాటిస్తాం’ అంటూ మళ్లీ సభికుల్ని నవ్వించారు.