జగన్ కు షాక్ ఇవ్వనున్న ఎమ్మెల్సీలు!!

ఐదేళ్లపాటు దుర్మార్గమైన పరిపాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి.. కేవలం ప్రజాదరణ కోల్పోయాడనే కారణం ఒక్కటి మాత్రమే కాదు.. అధికారంలో ఉన్నప్పుడు కన్నూ మిన్నూ కానకుండా ఆయన అనుసరించిన ఒంటెత్తు పోకడలు కూడా ఇప్పుడు తమ ప్రభావం చూపిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు అనే సంగతిని గ్రహించిన పార్టీ నాయకులు అంతా ఇప్పటికే వలస బాట పడుతున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి పార్టీ లలో తమను ఎవరూ చేరదీస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఆ పార్టీలను సంప్రదిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం శాసన మండలిలో ఎమ్మెల్సీలుగా ఉన్న వారు కూడా.. భవిష్యత్తుకు గ్యారెంటీ లేని వైసిపి నీ వదలి, చంద్రబాబు పంచన చేరడానికి ఉత్సాహ పడుతున్నట్టుగా తెలుస్తోంది.

మండలి డిప్యూటీ చైర్మన్ జకీయ ఖానం, తాను వెళ్లి తెదేపాకు చెందిన మంత్రి ఫరూక్ ను కలవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉంది. వైసిపి లో ఏదో మొక్కుబడిగా పదవి ఇచ్చారే తప్ప ఎలాంటి ప్రాధాన్యం లేదని, ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని ఆమె చెప్పినట్టుగా తెలుస్తోంది. జకీయా బాటలోనే మరికొందరు ఎమ్మెల్సీలు ఉన్నారు. కొందరు అప్పుడే నేరుగా కలవకుండా.. వర్తమానం పంపి, సమ్మతికోసం ఎదురు చూస్తున్నారు. ఓకే అంటే పార్టీలో చేరుతానని అంటున్నారు.

జగన్ జమానాలో ఎమ్మెల్యే లకే వీసమెత్తు విలువ ఉండేది కాదు. ఎమ్మెల్సీల పరిస్థితి చెప్పే అవసరమే లేదు. ఐదేళ్లలో జగన్ వారితో సమావేశం అయిన సందర్భాలే లేవు. ఎన్నికల్లో ఓడిపోయి కేవలం 11 మంది మాత్రమే గెలిచిన తరువాత ఆయనకు వీరు కనిపించారు. మండలిలో సంఖ్యాబలం మెజారిటీ ఉన్న వీరితో సమావేశం పెట్టుకున్నారు. జగన్ బుద్ధి ఎలాంటిదో వారికి అప్పుడే అర్థం అయింది.

గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు మండలిలో తన పార్టీకి మెజారిటీ లేదనే ఉద్దేశంతో ఏకంగా మండలిని రద్దు చేయడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నం ఫలించలేదు. తీరా తెదేపా నుంచి కొందరిని తమలో కలుపుకుని అక్కడ కూడా మెజారిటీ వచ్చాక ఊరుకున్నారు. 

ఇప్పుడు తెదేపా కు మండలిలో మెజారిటీ లేదు. అయితే మండలి రద్దు వంటి అనాలోచిత నిర్ణయానికి వారు వెళ్లడం లేదు. నిమ్మలంగానే ఉన్నారు. కాకపోతే జగన్ తీరు గ్రహించిన, అక్కడ భవిష్యత్తు లేదు అని భయపడుతున్న వైసిపి ఎమ్మెల్సీలు తెదేపాలోకి రావాలని అనుకుంటున్నారు. ఇద్దరు టీచర్ ఎమ్మెల్సీలు కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. త్వరలోనే మండలి లో టిడిపి బలం పెరుగుతుందని.. జగన్ కు షాక్ తప్పదు అని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories