ఎమ్మెల్యేలు కోటంరెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి!

పేదవాడి కడుపు నింపే అన్న క్యాంటీన్ ల వ్యవస్థను చంద్రబాబునాయుడు మళ్లీ అమల్లోకిక తీసుకువచ్చారు. ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. ఈ భారం ఆయన భుజానకెత్తుకున్నారు. అయితే ప్రభుత్వం మీద భారం తగ్గుతూ అన్న క్యాంటీన్ వ్యవస్థ నిరాటంకంగా నడవడానికి చంద్రబాబునాయుడు దాతల నుంచి విరాళాలు కూడా ఆహ్వానిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నెల్లూరుజిల్లా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించిన నిర్ణయం ఆదర్శనీయంగా ఉంది. నియోజకవర్గంలో అభిమానులు ఎవ్వరూ తన ఫ్లెక్సిలు ఏర్పాటు చేయకుండా.. ఆ డబ్బును అన్న క్యాంటీన్లకు విరాళంగా ఇవ్వాలని ఆయన పిలుపు ఇవ్వడం మంచి పరిణామం. నిజానికి రాష్ట్రంలోని ప్రతి ఎమ్మెల్యే కూడా అనుసరించాల్సిన మార్గం ఇది.

ఊర్లలో ఫ్లెక్సిలు అనేవి ఒక చండాలమైన సంస్కృతిగా తయారైపోయింది. ప్రతి అనాకానీ నాయకుడూ పెద్దపెద్ద ఫ్లెక్సిల్లో ఎమ్మెల్యే బొమ్మ ఒకవైపు.. తన బొమ్మ ఒకవైపు వేయించుకుంటూ తమను తాము పొలిటికల్ సెలబ్రిటీలుగా మాన్యుఫాక్చరింగ్ చేసుకోవడానికి ఈ ఫ్లెక్సిలు ఒక మార్గం అవుతున్నాయి. పైగా ఏ ఊళ్లో అయినా ఒక గుడి ఉన్నదంటే.. అక్కడ గుడి ఉన్నదని, దేవుడు ఉన్నాడని కూడా బయటివారికి కనిపించకుండా దానిచుట్టూ గుడికంటె పెద్ద ఫ్లెక్సిలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఫ్లెక్సిల దరిద్రాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వమే ఏదైనా పూనిక తీసుకోవాల్సిన అవసరం ఉంది. నెల్లూరు రూరల్ లో రాజకీయ ఫ్లెక్సిలు దర్శనమివ్వకుండా కోటంరెడ్డి మంచి పనిచేశారు.

ఫ్లెక్సిలు ఏర్పాటుచేయడానికి అయ్యే ఖర్చు తక్కువే కావొచ్చు.. కానీ అలాంటివి ప్రతిరోజూ జరుగుతూ ఉంటాయి. ఆ చిన్న మొత్తాలన్నీ జమ అయితే.. అన్న క్యాంటీన్ వంటి వ్యవస్థ నడవడానికి గొప్ప మేలు అవుతాయి. నిజానికి ఎమ్మెల్యేలు అందరూ కూడా కోటంరెడ్డిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్లెక్సిలలో తమ బొమ్మ కనిపించకపోతే.. ప్రజలు తమను మర్చిపోతారేమో అని భయపడే నాయకులు ఉంటే వారి ఖర్మ. కానీ ప్రజా నాయకులుగా గెలిచిన ఎమ్మెల్యేలు ఫ్లెక్సిలను కట్టడిచేయాలి. ఆ మొత్తాలను అన్న క్యాంటీన్లకు విరాళంగా ఇవ్వమని అందరూ పిలుపు ఇస్తే కనీసం పేదోడి కడుపు నిండుతుందని తెలుసుకోవాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories