జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని, విచ్చలవిడిగా ప్రవర్తించిన నాయకులకు ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి! ఎవరి పాపం ఎప్పుడు బయటకు వస్తుందో.. ఎవరి మీద ఎప్పుడు కేసు నమోదు అవుతుందో.. ఎవరు ఏ క్షణాన జైలుకు వెళ్లవలసి వస్తుందో వారికి అంతుచిక్కడం లేదు. ఇప్పటికే చాలామంది నాయకులు రకరకాల కేసులలో జైలు పాలు అవుతుండగా.. కొందరు అతిగా భయపడుతున్నారు! కొందరు గుమ్మడికాయల దొంగ అంటే ముందుగానే భుజాలు తడుముకుంటున్నారు. భుజాలు తడుముకోవడం మాత్రమే కాదు- తమ భుజాలు నొప్పి పెట్టకుండా లేపనం కావాలని అడుగుతున్నారు! అంటే వారి మీద నేరారోపణ కూడా పూర్తిగా జరగకమునుపే ముందస్తు బెయిలు కావాలని ఆరాటపడుతున్నారు.
జగన్ ప్రభుత్వం హయాంలో మద్యంవ్యాపారం రూపంలో జరిగిన దాదాపు 50 వేల కోట్ల రూపాయల అరాచకత్వానికి కేంద్ర బిందువుగా వ్యవహరించినట్లు, మొత్తం దందాను తెర వెనుక నుంచి నడిపించినట్లు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి అందరికీ తెలిసిందే! మద్యం వ్యాపారంలో జరిగిన అక్రమాలను ప్రభుత్వం నిగ్గు తేల్చింది. కొందరిని విచారించింది. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి కనీసం ఇప్పటిదాకా ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదు. కేసులో ఆయన పేరును నిందితుడిగా చేర్చడం కూడా ఇప్పటిదాకా జరగలేదు. అయితే తన అరెస్టు తప్పదని అతిగా భయపడుతున్న మిథున్ రెడ్డి ముందుగానే బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆలుచూలు లేకుండానే కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా.. కేసు, నోటీసు లేకుండానే ముందస్తు బెయిలు కోసం మిథున్ రెడ్డి దరఖాస్తు చేసుకోవడం నవ్వుల పాలు చేస్తున్నది.
ఆయన పిటిషన్ విచారణ సందర్భంగా- సిఐడి వారు కోర్టుకు వాస్తవాలను నివేదించారు. మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి ని నిందితుడిగా చేర్చలేదని, విచారణకు రావాల్సిందిగా ఆయనకు నోటీసులు ఇవ్వడం కూడా ఇప్పటిదాకా జరగలేదని సిఐడి న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. కేసు అపరిపక్వ దశలో మిథున్ రెడ్డి తొందరపడి ముందస్తు బెయిలు పిటిషన్ వేసినట్లుగా పేర్కొన్నారు. గత ప్రభుత్వ కాలంలో ప్రత్యేక అధికారిగా పనిచేసిన సత్య ప్రసాద్ మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మిథున్ రెడ్డి పేరు నిందితుల్లో చేరుస్తారని కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ వార్తలు చూడగానే ఆయన భుజం తడుముకున్నారు. బెయిలు పిటిషన్ వేసుకున్నారు. అయితే విచారణ వాయిదా వేసిన న్యాయమూర్తి, అప్పటిదాకా అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని మిథున్ రెడ్డి న్యాయవాది చేసిన అభ్యర్థనను తిరస్కరించారు. చేసిన పాపాల గురించి మిథున్ రెడ్డి అతిగా భయపడుతూ ఉన్నట్లు కనిపిస్తోందని ప్రజలు అంటున్నారు.