మూడున్నర వేలకోట్ల రూపాయలకుపైగా ప్రజాధనాన్ని ముడుపుల రూపంలో కాజేసిన అతిపెద్ద కుంభకోణంలో.. మాస్టర్ మైండ్ గా అందరూ అభివర్ణిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి శనివారం రాత్రి 8.20 గంటల ప్రాంతంలో అరెస్టు అయ్యారు. ఈ కుంభకోణానికి సంబంధించి గతంలో ఒకసారి సాక్షిగా ఆయనను పిలిపించి విచారించిన సిట్ పోలీసులు, ఆ తర్వాత ఆయనను ఏ4 నిందితుడిగా చేర్చారు. నిందితుడిగా చేర్చిన తర్వాత.. తొలిసారిగా శనివారమే విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు.
ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో చేసిన ప్రయత్నాలు కూడా తిరస్కరణకు గురయ్యాయి. ఆ నేపథ్యంలో శనివారం విచారించిన తర్వాత.. మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తారని అందరూ ఊహించారు. దానికి తగ్గట్టుగానే.. శనివారం మధ్యాహ్నం సిట్ కార్యాలయానికి వచ్చిన మిథున్ రెడ్డిని సుదీర్ఘంగా 7 గంటలకు పైగా విచారించిన అధికారులు రాత్రి 9 గంటల సమయంలో అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు.
ఆరెస్టు చేస్తున్నట్టుగా ఆయనకు నోటీసులు ఇచ్చి తర్వాత అరెస్టు చేశారు. ఆయనను అరెస్టు చేసినట్టుగా సమాచారాన్ని నిబంధనల ప్రకారం ఆయన కుటుంబసభ్యులకు కూడా తెలియజేశారు. ఆయనను ఆదివారం సాయంత్రం న్యాయమూర్తి ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఆయనకు న్యాయమూర్తి పద్నాలుగు రోజుల రిమాండు విధించే అవకాశం ఉన్నదని తెలుస్తోంది.
జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొదలు కాగానే.. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకోవడానికి కొత్త కొత్త పాలసీలు రూపొందించే ప్రయత్నాలు అనేకం జరిగాయి. వాటిలో భాగంగానే.. లిక్కరు వ్యాపారానికి సంబంధించి కూడా కొత్త పాలసీ తయారైంది. ప్రభుత్వం ద్వారానే మద్యం దుకాణాలను నిర్వహించడం వల్ల.. మొత్తం అమ్మకాలు తమ కనుసన్నల్లోనే ఉంటాయని, తమతో లాలూచీ పడిన మద్యం కంపెనీలకు మాత్రమే ఆర్డర్లు ఇవ్వడం ద్వారా.. వారినుంచి డైరక్టుగా తామే కమిషన్లు తీసుకోవచ్చునని, అలాగే ధరలు కూడా పెంచేస్తే.. పెంచిన ధరల మొత్తం కూడా తామే కాజేయవచ్చునని ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు.
ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ పేరుతో లిక్కరు వ్యాపారం కోసం ఒక సంస్థను ఏర్పాటుచేశారు. ఆ సంస్థ ఎండీ, ఎక్సయిజు శాఖ అధికారులతో కలిసి పాలసీ విధివిధానాలు ఎలా ఉండాలి.. ఏ రూపంలో గుట్టుచప్పుడు కాకుండో వేల కోట్లరూపాయలు దోచుకోవడం సాధ్యమవుతుంది అనే దిశగా వారంతా కసరత్తు చేశారు. ఆ విషయంలో మిథున్ రెడ్డిదే మాస్టర్ మైండ్ అని విచారణలో తేలింది. పాలసీ రూపకల్పన తర్వాత.. మద్యం కంపెనీలనుంచి వసూళ్లు రాబట్టే బాధ్యత మాత్రం రాజ్ కెసిరెడ్డి చేతిలో పెట్టారు. ఆయన ఆ పని సమర్థంగా చేయడానికి ఒక పెద్ద నెట్వర్క్ ను నడిపించారు. మిథున్ రెడ్డి మార్గదర్శకాల మేరకు వసూళ్లు చేసిన డబ్బులను రకరకాల మార్గాల్లో ఆయన చెప్పిన వారికి చేరవేశారు. మొత్తానికి కేసువిచారణ ప్రారంభమైన తర్వాత.. నాలుగునెలలుగా హైడ్రామా నడుస్తూ రాగా.. ఎట్టకేలకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు జరిగింది.