సిట్ ఎదుట మిథున్ : నయా నెంబర్2 కు ముచ్చెమటలు!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రెండురోజులుగా ‘నెంబర్ 2’ కు సంబంధించిన చర్చ బాగా నడుస్తోంది. ఒకవైపు తాను ఎప్పుడూ నెంబర్ 2 కాదని అంటూనే.. తనను నెంబర్ 2 నుంచి నెంబర్ 2000 వరకు పడదోశారని విజయసాయిరెడ్డి శుక్రవారం ఆరోపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 అనేది ఉండదని, నెంబర్ 1 నుంచి 100 వరకు జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఉంటారని కౌంటర్ ఇచ్చారు రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. వీరి వాదోపవాదాలు పక్కన పెడితే.. నాలుగేళ్లలో మూడువేల కోట్ల రూపాయలకు పైగా సొమ్ము స్వాహా చేసినట్టుగా పోలీసులు లెక్కతేల్చిన లిక్కర్ స్కామ్ కు సంబంధించినంత వరకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని.. నెంబర్ టూగా పరిగణించాల్సిందే. ఎందుకంటే.. మద్యం డిస్టిలరీ లనుంచి రావాల్సిన వాటాలన్నీ తన నెట్ వర్క్ ద్వారా సమీకరించిన తర్వాత.. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఆ మొత్తాన్ని మిథున్ రెడ్డికి చేరవేసేవాడని.. అక్కడినుంచి బిగ్ బాస్ కు అందేదని పోలీసులు తేల్చారు. కాబట్టి మిథున్ రెడ్డినే ఈ వ్యవహారం వరకు నెంబర్ టూ అనుకోవాలి. అలాంటి నెంబర్ టూ శనివారంనాడు సిట్ విచారణలో వారు శరపరంపరగా సంధించిన ప్రశ్నలకు జవాబులు చెప్పలేక నీళ్లు నమిలారు. దాటవేసే ప్రయత్నం చేశఆరు. మొత్తానికి ఆయనకు ముచ్చెమటలు పట్టాయని తెలుస్తోంది.

ఇప్పటికే అధికారులు, బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ల వాంగ్మూలాలనుంచి పోలీసులు కొన్ని వివరాలు సేకరించారు. రాజ్ కసిరెడ్డి అందుబాటులోకి రాకపోయినప్పటికీ.. శుక్రవారం విచారణకు వచ్చిన విజయసాయిరెడ్ది ద్వారా సిట్ చాలా వివరాలు తెలుసుకుంది. ఆయనకు మొత్తం 135 ప్రశ్నలు సంధించి వివరాలు తీసుకుంది. అవన్నీ సమన్వయం చేసుకుని.. మిథున్ రెడ్డిని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది.

మిథున్ రెడ్డి శనివారం ఉదయం సిట్ ఆఫీసుకు రాగా.. మధ్యలో గంట భోజన విరామం కూడా కలుపుకుంటే.. ఏకంగా ఎనిమిదిగంటలపాటు పోలీసులు ఆయనను ప్రశ్నించారు. కోర్టు ద్వారా ఆయన అనుమతి పొందినట్లుగా న్యాయవాది సమక్షంలోనే మొత్తం విచారణ సాగించారు. రాజ్ కసిరెడ్డికి చెందిన ఆడాన్ డిస్టిలరీ గురించి విజయసాయి అనేక వివరాలు చెప్పిన సంగతి తెలిసిందే. అందులో మిథున్ రెడ్డికి కూడా వాటాలున్నట్టు పుకార్లు వచ్చాయి. దానితో పాటు డికార్ట్ సంస్థ నుంచి కార్పొరేషన్ ఎంత మేర మద్యం కొనుగోళ్లు జరిపింది అనే వివరాలన్నీ సిట్ అడిగినట్టుగా తెలుస్తోంది. అలాగే రాజ్ కసిరెడ్డి.. అతని వసూళ్ల నెట్ వర్క్ ముఖ్యులతో మిథున్ కు గల సంబంధాల గురించి కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తోంది.

చివరగా.. ఆయన చెప్పిన సమాధానాలన్నింటినీ రికార్డు చేసి.. వాటి మీద ఆయన సంతకాలు తీసుకుని, విచారణకు మళ్లీ రావాల్సి ఉంటుందని మిథున్ రెడ్డిని పంపేశారు. అయితే.. చాలా ప్రశ్నలకు మిథున్ రెడ్డి బాగా ఇబ్బంది పడినట్టుగా తెలుస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories