అధికారంలో ఒక చోట ఉంటే.. ఎక్కడైనా సరే తమ దందాలు నడిపించడంలో చెలరేగిపోతూ ఉంటారనడానికి ఇది ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని.. హత్య కేసులో కీలకంగా ఉన్నా సరే.. నిశ్చింతగా తిరుగుతూ వైఎస్ అవినాష్ రెడ్డి ఉండగలిగినప్పుడు.. ఆయన అనుచరులు కూడా అదే బాటలో ఉంటారు కదా. వైఎస్ అవినాష్ రెడ్డి అండ చూసుకుని వారు విచ్చలవిడిగా తమ దందాలను కొనసాగించారు. వారి అకృత్యాలు, అరాచకాలు తెలంగాణ దాకా పాకాయి. అక్కడివారిని కూడా విడిచిపెట్టలేదు. అప్పట్లో నమోదైన కేసులకు సంబంధించి ఇప్పటిదాకా బాధితుడిని వేధిస్తూనే ఉన్నారు. తాజాగా ఈ గొడవ వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ సంగారెడ్డికి చెందిన సతీష్ కుమార్ కార్ రెంటల్ సంస్థను నడుపుతాడు. వికారాబాద్ కు చెందిన మణిరాజ్ 2021లో అతని వద్ద అయిదు కార్లు అద్దెకు తీసుకున్నాడు. నాలుగునెలలు అద్దె చెల్లించిన తర్వాత మొహం చాటేశాడు. ఆరాతీస్తే పులివెందుల మెడికల్ కాలేజీకి కార్లు లీజుకు ఇచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు సంగారెడ్డి పోలీసు స్టేషన్ లో కేసు పెట్టారు. అప్పట్లో కడపజిల్లా వేంపల్లె ఎస్ఐ వద్దకు సతీష్ కుమార్ వెళ్లి కలిశారు. ఆయన సూచన మేరకు వైసీపీ నాయకులు, అవినాష్ రెడ్డి అనుచరులు వేంపల్లె జడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, మాజీ సర్పంచి శివశంకర్ రెడ్డి, ఎంపీటీసీ భారతి, మరోనేత ప్రసాద్ రెడ్డి వద్దకు వెళ్లారు. వాళ్లంతా సతీష్ కుమార్ ను నిర్బంధించి తీవ్రంగా కొట్లి కార్లు అడిగితే చంపేస్తాం అంటూ బెదిరించారని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
తాను అద్దెకు ఇచ్చిన కార్లలో ఒకదానికి తన ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయిందని, ఆ కార్లను గంజాయి అక్రమ రవాణా తదితర పనులకు వాడుతున్నట్లు తెలిసిందని సతీష్ కుమార్ అంటున్నాడు.
ప్రభుత్వం మారిన తర్వాత.. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మంత్రి ఫరూక్, వర్ల రామయ్య తదితరులకు అర్జీ సమర్పించడంతో ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. జగన్ పాలనలో ఆయన అండ చూసుకుని.. ఆయన అనుచరులు, సొంత మనుషులు.. వారి అండ చూసుకుని వారి తొత్తులు తైనాతీలు ఎంత దారుణంగా చెలరేగిపోతూ వచ్చారో తెలుసుకోవడానికి ఇది కూడా ఒక ఉదాహరణ. ప్రభుత్వం మారిన తర్వాత.. అప్పట్లో అన్యాయానికి గురైన వారు ఒక్కరొక్కరుగా ధైర్యం చిక్కబట్టుకుని వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. అయిదేళ్లు కాలం నాటి పాపాలు ఇంకా ఎన్ని బయటకు వస్తాయోనని ప్రజలు అనుకుంటున్నారు.