పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మేఘా ఇంజినీరింగ్ సంస్థ నడిపిస్తున్న ప్రహసానికి త్వరలోనే తెరపడనుందా? మేఘా సంస్థకు షో డౌన్ చేస్తూ.. త్వరలోనే నిర్మాణ పనులు వారి చేజారిపోనున్నాయా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడగానే.. అప్పటికి పనులు చాలా వేగంగా చేస్తూవచ్చిన సంస్థను కక్ష గట్టినట్టుగా పక్కకు తప్పించేశారు. అయితే ఆ తొందరలో నిబంధనలు పాటించకుండానే.. తమకు భారీగా విరాళాలు అందించే మేఘా సంస్థకు పనులు కట్టబెట్టేశారు. ఏ రివర్స్ టెండరింగ్ పద్ధతి ద్వారా అయితే.. ఈ పోలవరం పనులను మేఘాకు ధారాదత్తంచేశారో.. ఆ పద్ధతికే కేబినెట్ ఆమోదాలు లేకపోవడం అనే సాంకేతిక చిక్కులు ఇప్పుడు తెరమీదకు వస్తున్నాయి. అసలు మేఘా కేటాయించిన వైనం చెల్లుతుందా లేదా అనే అనుమానాలు న్యాయనిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
జగన్ అధికారంలోకి రాగానే.. అమరావతిలో విధ్వంసం ప్రారంభించినట్టే.. పోలవరం మీద కూడా విషపు చూపులు సారించారు. అన్ని నిబంధనలుతుంగలో తొక్కారు. అసలు ఆయన తెరపైకి తెచ్చిన రివర్స్ టెండరింగ్ అనే పద్ధతికే కేబినెట్ ఆమోదం లేనే లేదని ఇప్పుడు తెరమీదకు వస్తోంది. ఇదంతా జగన్ సొంత నిర్ణయంగానే అమలులోకి వచ్చేసింది. పనులు కూడా మేఘాకు కేటాయించేసిన ఏడాది తర్వాత.. కేబినెట్ ఆమోదం తీసుకున్నారు. ఆ వక్ర వ్యవహారాలన్నీ ఇప్పుడు వివాదంగా మారబోతున్నాయి.
అసలు మేఘాకు పనులు కేటాయించిన జీవోలే చెల్లుబాటు అయ్యే అవకాశం లేదని ఇప్పుడు నిపుణులు అంటున్నారు. ఇప్పటికైనా సరే.. మేఘా సంస్థ జాగ్రత్తపడి.. పోలవరం నిర్మాణ పనుల నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటే వారికి పరువు దక్కుతుందని, చిక్కులు తప్పుతాయని.. లేదా మొండిగా అక్కడే ఉంటే ముందుముందు న్యాయపరమైన చిక్కులు జరిమానాలు కట్టేదాకా వెళ్లవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మేఘా ఆధ్వర్యంలో పోలవరం పనులు ముందుకు సాగలేదు సరికదా.. ప్రాజెక్టు పురోగతి సర్వనాశనం అయింది. తమకు ఫండింగ్ ఏజన్సీ వంటి మేఘా సంస్థకు విచ్చలవిడిగి నిధులు దోచిపెట్టడం తప్ప.. పనుల గురించి జగన్ సర్కారు ఏనాడూ పట్టించుకోకపోవడం వలన ఇలాంటి దుస్థితి ఏర్పడినట్టు అందరూ అనుకుంటున్నారు.