ఏపీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులకు అనుకూలంగా మెగాస్టార్ చిరంజీవి ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారా? అంటే విశ్వసనీయ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఒకవైపు ఆయన ఇంకా తమ కాంగ్రెసు పార్టీ సభ్యుడిగానే ఉన్నారని.. ఏపీలో కాంగ్రెసు నాయకులు చెప్పుకుంటూనే ఉన్నారు. కానీ.. మెగాస్టార్ చిరంజీవి మాత్రం.. ఎన్డీయే కూటమి అభ్యర్థులకు అనుకూలంగా ఉన్నాననే సంకేతాలు ఇస్తున్నారు. వారికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. అయితే మెగాస్టార్ జోక్యం ఇంతటితో ఆగడం లేదు. ఎన్నికల ప్రచారం చివరి దశకు వచ్చేసరికి ఆయన స్వయంగా రంగంలోకి దిగి.. ఎన్నికల ప్రచార సభలలో పాల్గొంటారని కూడా తెలుస్తోంది.
అనకాపల్లి నుంచి బిజెపి ఎంపీ అభ్యర్థిగా పోలీచేస్తున్న సీఎం రమేష్, పెందుర్తి నుంచి జనసేన తరఫున ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న పంచకర్ల రమేశ్ బాబు ఇద్దరూ హైదరాబాదులోని చిరంజీవి నివాసంలో ఆయనను కలిశారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడడాన్ని స్వాగతించిన చిరంజీవి ‘ఇది మంచి పరిణామం. చాలా సంతోషం. చాలాకాలం తర్వాత ఇప్పుడే రాజకీయాలపై మాట్లాడడానికి ప్రధాన కారణం తమ్ముడు పవన్ కల్యాణ్’ అంటూ ప్రకటించారు.
ఈ ఇద్దరు అభ్యర్థులకు అనుకూలంగా మెగాస్టార్ ఒక ప్రచార వీడియోను కూడా విడుదల చేశారు. ‘ఏపీ అభివృద్ధి పథంలో వెళ్లాలనేది నాకు పెద్ద కోరిక. మీరంతా అందుకు నడుం బిగించండి. మీరంతా వీరికి ఓటేయండి. మీ ఆశీస్సులు వారికి ఉన్నాయనే నమ్మకాన్ని మాకు కలిగించండి’ అంటూ అభిమానులకు పిలుపు ఇచ్చారు.
సీఎం రమేశ్ తనకు చిరకాల మిత్రుడని, పంచకర్ల రమేశ్ కూడా తన ఆశీస్సులో రాజకీయ అరంగేట్రం చేసిన వారేనని. ఇద్దరూ మంచివారే కాకుండా, సమర్థులని వారిని గెలిపించాలని కోరారు.
అయితే మెగాస్టార్ ఇప్పటికే జనసేన పార్టీకి అయిదు కోట్ల రూపాయల విరాళం ఇవ్వడం ద్వారా పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయత్నానికి తన మద్దతు పుష్కలంగా ఉన్నదని సంకేతాలు పంపారు. ఇప్పుడు ఈ ఇద్దరికి అనుకూలంగా వీడియో సందేశం విడుదల చేశారు. అలాగే.. ఆయన ప్రచారం చివరి విడతలో స్వయంగా ప్రచార సభల్లో కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఆయనతో పాటు బాబాయి కోసం రామ్ చరణ్ కూడా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారని, రోడ్ షోలు నిర్వహిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.