ఏపీ ఎన్నికల పర్వంలో ఎన్డీయే కూటమి గెలవాలని కోరుకునే వారికి ఒక శుభవార్త. తెలుగు ప్రజల్లో తిరుగులేని విస్తృతమైన ప్రజాదరణ కలిగి ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఈ కూటమికి అనుకూలంగా ఎన్నికల ప్రచారంలోకి రావడానికి సూత్ర ప్రాయంగా అంగీకరించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అయితే.. ప్రచారాన్ని ఇప్పుడు సాగుతున్న తీరులోనే ముందుకు తీసుకువెళ్లాలని, ప్రచారం చివరి దశకు వచ్చిన తర్వాత.. అప్పటి సమీకరణాలను పరిశీలించి.. తాను కూడా రాష్ట్రంలో రెండు మూడు సభల్లో ప్రసంగిస్తే ఇంకా ఎడ్వాంటేజీ అవుతుందనే భావన ఉంటే గనుక.. తప్పకుండా ఎన్నికల ప్రచారానికి వస్తానని చిరంజీవి, తమ్ముడు పవన్ కల్యాణ్ కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ లో ఉన్నారు. హైదరాబాదు సమీపం ముచ్చింతల్ వద్ద షూటింగు జరుగుతోంది. జనసేనాని పవన్ కల్యాణ్, తన అన్నయ్య నాగేంద్రబాబుతో కలిసి.. సోమవారం నాడు చిరంజీవిని షూటింగ్ లొకేషన్లో కలిశారు. ప్రస్తుత రాజకీయ వాతావరణం, జరుగుతున్న పరిణామాలు, పరిస్థితులు గురించి వారు కొద్ది సేపు చర్చించుకున్నారు. పవన్ కల్యాణ్ రాజకీయ జీవితం విజయవంతంగా సాగడానికి హీరో చిరంజీవి తన ఆశీస్సులు అందజేశారు. తన కాళ్లు మొక్కి ఆశీస్సులు కోరిన తమ్ముడిని ఆయన మనస్ఫూర్తిగా దీవించారు.
కేవలం దీవెనలు మాత్రమే కాదు. తమ ఇంటిదైవం ఆంజనేయస్వామి విగ్రహం ఎదురుగా నిల్చుని.. జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి ఏకంగా అయిదు కోట్ల రూపాయల విరాళం కూడా ఇచ్చారు.
నిజం చెప్పాలంటే.. జనసేన పార్టీకి గానీ, చిరంజీవి స్థాయికి గానీ.. అయిదు కోట్లరూపాయల విరాళం అనేది పెద్ద విషయం కాదు. కానీ, ‘మెగాస్టార్ చిరంజీవి జనసేన పార్టీకి అండగా ఉన్నారు’ అనే మాట ద్వారా .. ప్రజల్లో రాగల సానుకూలత చాలా పెద్దది అని విశ్లేషకులు భావిస్తున్నారు. కాపు సామాజిక వర్గంలో ఓటు చీలకుండా, గంపగుత్తగా కూటమికి అనుకూలంగా మారడానికి చిరంజీవి మద్దతు ఉపయోగపడగలదని ఒక అంచనా. అలాగే కులమతాలతో నిమిత్తం లేకుండా చిరంజీవి ఫ్యాన్స్ లో కూడా ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్రమంత్రిగా పనిచేసిన తర్వాత.. రాజకీయంగా ఏ పార్టీతోనూ అనుబంధం కొనసాగించకుండా సైలెంట్ గా ఉంటున్నారు. కేవలం సినిమాలకే పరిమితం అయ్యారు. మధ్యలో సినీ పరిశ్రమ సమస్యల గురించి ముఖ్యమంత్రి జగన్ ను కలవడానికి వెళ్లినప్పుడు, ఆయనను పొగిడారు గానీ.. ఆ తర్వాత అదే సైలెన్స్ ను కొనసాగిస్తున్నారు.
వీటన్నింటికి అదనంగా.. చిరంజీవి ఎన్నికల ప్రచారంలోకి రావాలని పవన్ కల్యాణ్ కోరినట్టు సమాచారం. అయితే తక్షణం అందుకు ఓకే అనకుండా.. ఇప్పుడు సాగుతున్నది యథాతథంగా చేస్తూ పోతే.. ప్రచారం చివరి దశలో అవసరమైతే వస్తానని చిరంజీవి హామీ ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.