నాయకులు ప్లాన్ చేసే కొన్ని కార్యక్రమాలు మాత్రమే కాదు.. కొన్ని సందర్భాల్లో వాటిని ప్లాన్ చేస్తున్న టైమింగ్ కూడా వారి బుద్ధులను, వారు ఆశిస్తున్న లక్ష్యాలను బయటపెడుతుంటుంది.ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పేరెంట్స్ టీచర్స్ మీటింగులు ఇటీవలి కాలంలో సాధారణంగా మారాయి. పిల్లల తండ్రులతో టీచర్లకు ఇంటరాక్షన్ ఉండడం వల్ల.. మరింత మెరుగైన విద్యను పిల్లలకు అందించడం సాధ్యమవుతుందని అందరి నమ్మకం గనుక వీటిని నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వాలు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగులను కూడా ప్లాన్ చేస్తున్నాయి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటివి ప్లాన్ చేశారు. ఇప్పుడు జులై 10వ తేదీన అలాంటి మెగా పేరంట్ టీచర్స్ మీటింగు జరగనుంది. తమాషా ఏంటంటే.. ఈ మీటింగులను ఈ నాయకులు ఏ సమయంలో ప్లాన్ చేస్తున్నారనేదే వారి ఆలోచన సరళిని తెలియజెబుతోంది అని విశ్లేషకులు అంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో మార్చి నెలలో అది కూడా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మెగా పేరంట్ టీచర్స్ మీటింగులను ఏర్పాటు చేశారు. ఆ మీటింగులు ప్లాన్ చేయడం వెనుక జగన్ లక్ష్యం ఒక్కటే. పిల్లల తల్లిదండ్రులందరినీ పిలిచి.. మీకు మేం అంతసొమ్ములు ఇచ్చాం.. ఇంత డబ్బులు ఇచ్చాం అని చెప్పించడం.. వారందరితోనూ.. జగనన్నకు రుణపడి ఉంటాం అని మాట్లాడించడం.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో సర్కులేట్ చేయడం అంతిమంగా ఈ మీటింగులు ద్వారా ఓట్లను రాబట్టుకోవడం మాత్రమే. విద్యార్థులు చదవులకు సంబంధించి గానీ, వికాసానికి సంబంధించి గానీ అలాంటి మీటింగులకు ఉపయోగపడాలనే కోరిక ఆయనకు లేశమాత్రం కూడా లేదు.
కానీ కూటమి ప్రభుత్వం హయాంలో ఏం జరుగుతోంది. చక్కగా పాఠశాలలు ప్రారంభం అయిన నెల తర్వాత.. జులై నెలలో 10 వతేదీన తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల.. పిల్లల గురించి టీచర్లు తల్లిదండ్రులకు సూచనలు చేసే అవకాశం ఉంటుంది. పిల్లల చదువుల విషయంలో బడిలో తాము చెప్పేది చెప్పి పంపుతామని, ఇళ్ల వద్ద తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే.. పిల్లలను చదివించడంలో ఎలాంటి శ్రద్ధ చూపిస్తే వారు రాణిస్తారో మాట్లాడుకోవడానికి వీలవుతుంది. పాఠశాలలు ప్రారంభం అవుతున్న సమయంలో తల్లిదండ్రులకు టీచర్లకు ఇంటరాక్షన్ ఉండడం వలన ఏడాది పొడవునా పిల్లల చదువులు సవ్యంగా సాగే అవకాశం ఉంటుంది. ఇలాంటి సదాలోచనతో నారా లోకేష్ ఆధ్వర్యంలో జులై 10న నిర్వహిస్తున్నారు.
గతంలో జగన్ కేవలం ఓట్లు దండుకోవడమే లక్ష్యంగా ప్లాన్ చేసిన మీటింగులు కోడ్ కారణంగా కోర్టు తీర్పులతో ఆగిపోయాయి. కానీ.. ఇప్పడు లోకేష్ కేవలం పిల్లల కోసం నిర్వహిస్తుండడం గొప్ప విషయం అని పలువురు కితాబిస్తున్నారు.