తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి నియామకాన్ని చంద్రబాబు నాయుడు బుధవారం ప్రకటించారు. బోర్డు చైర్మన్ గా ప్రముఖ మీడియా సంస్థల అధిపతి బిఆర్ నాయుడు నియమితులయ్యారు. ఆయన టీవీ5 న్యూస్ ఛానల్ తో పాటు, హిందూధర్మం పేరుతో ఒక ఆధ్యాత్మిక ఛానల్ ను, ఆధ్యాత్మిక మాస పత్రికను కూడా నిర్వహిస్తున్నారు. బిఆర్ నాయుడుకు టీటీడీ పగ్గాలు అందించడంతోపాటు 24 మంది సభ్యులతో పూర్తిస్థాయి ధర్మకర్తల మండలిని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ నియామకంతో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యంత కీలకమైన నామినేటెడ్ పదవుల పందేరంలో ఒక అంకం పూర్తి అయినట్లుగా కనిపిస్తోంది.
చంద్రబాబు నాయుడు ప్రకటించిన టిటిడి బోర్డులో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 12 మంది ఉండగా మిగిలిన 12 మంది ఆంధ్ర ప్రదేశ్ నివాసులే. వీరిలో ముగ్గురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు. ఒకరు గతంలో తెదేపా తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన వారు. భిన్న రంగాల నుంచి ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి సేవా తత్పరత కలిగిన ప్రముఖులను ఎంపిక చేసి టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించినట్లుగా కూర్పును గమనిస్తే మనకు అర్థం అవుతుంది.
నిజానికి టీటీడీ బోర్డు చైర్మన్ గా టీవీ5 అధినేత బిఆర్ నాయుడు పేరును ప్రతిపాదించడం అనేది ఇవాళ్టి సంగతి కాదు. ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి- ఈ పదవికి ఆయన పేరు మాత్రమే వినిపిస్తోంది. మధ్యలో ఎంతమంది ప్రయత్నాలు చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రం బీఆర్ నాయుడుకు పదవి కట్ట పెట్టడానికి స్థిర నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే బోర్డు సభ్యుల విషయంలో ఒత్తిళ్లు అనేకం ఉండగా చంద్రబాబు నాయుడు ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోయినందువలన జాబితా ప్రకటన ఆలస్యం అయినట్లుగా అమరావతి వర్గాలు చెబుతున్నాయి.
ఈ బోర్డులో జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎంఎస్ రాజు, పనబాక లక్ష్మి, జాస్తి పూర్ణ సాంబశివరావు, నన్నూరి నర్సిరెడ్డి, శ్రీసదాశివరావు నన్నపనేని, కృష్ణమూర్తి, కోటేశ్వరరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, జంగా కృష్ణమూర్తి, దర్శన్ ఆర్.ఎన్, జస్టిస్ హెచ్ ఎల్ దత్, శాంతారామ్, పి.రామ్మూర్తి, జానకీదేవి తమ్మిశెట్టి, బూంగునూరు మహేందర్ రెడ్డి, అనుగోలు రంగశ్రీ, బూరగాపు ఆనందసాయి, సుచిత్ర ఎల్ల, నరేశ్ కుమార్, డా. అదిత్ దేశాయ్, సౌరభ్ హెచ్ బోరా లు సభ్యులుగా ఉన్నారు.
తిరుమలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో జరుగుతూ వచ్చిన సకల అరాచక వ్యవహారాలను ఎండగట్టడంలో కీలకపాత్ర పోషించిన టీవీ5 అధినేత బిఆర్ నాయుడు ఇప్పుడు తానే టీటీడీ సారధిగా అక్కడి వ్యవహారాలను సమూలంగా ప్రక్షాళన చేస్తారనే విశ్వాసం భక్తకోటిలో వ్యక్తం అవుతోంది.