మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. శ్రీసిటీలో ఏకంగా 16 పరిశ్రమలను ఒకేసారి చంద్రబాబునాయుడు ప్రారంభించేసరికి ఓర్వలేకపోతున్న గుడివాడ అమర్నాథ్.. దానికి సంబంధించిన కీర్తి మొత్తం తమకే దక్కాలంటూ గొంతు చించుకుంటున్నారు. తమ ప్రభుత్వ హయాంలో 2023 మార్చిలో విశాఖలో నిర్వహించిన జీఐఎస్ ద్వారా కుదుర్చుకున్న 386 ఎంఓయూలలో భాగంగా ఏర్పాటైనవే ఈ పరిశ్రమలన్నీ అని కూడా అంటున్నారు. ఒక్కో పరిశ్రమ ఏర్పాటుకు 6 నెలల నుంచి ఏడాది సమయం పడుతుందని కూడా అంటున్నారు.
ఇక్కడ గుడివాడ గమనించాల్సిన సంగతి ఒకటుంది. ఇప్పుడు చంద్రబాబు ఏయే 16 పరిశ్రమలను ప్రారంభించారో స్పష్టంగా అందరికీ తెలుసు కదా? గత ఏడాది మార్చిలో చేసుకున్న 386 ఒప్పందాలు ఏయే సంస్థలతోనో అప్పటి పరిశ్రమల మంత్రి అయిన గుడివాడకు అంతకంటె బాగా తెలుసు కదా? ఇప్పుడు ప్రారంభమైన వాటిలో ఎన్ని సంస్థలకు గత ఏడాది మార్చిలో ఒప్పందం జరిగిందో.. ఎన్నింటికి జగన్ చేతుల మీదుగా శంకుస్థాపనలు చేశారో.. గుడివాడ అప్పటి ఎంఓయూ పత్రాలను మీడియా ముందు ఉంచి మాట్లాడితే ఆయన మాటలకు క్రెడిబిలిటీ ఉంటుంది కదా అనేది ప్రజల సందేహం.
మాననీయ మాజీ మంత్రి వర్యులు గుడివాడ అమర్నాథ్ సెలవిస్తున్నట్టుగా.. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోలగా చంద్రబాబునాయుడు ఏకంగా 16 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేసి.. ఆయన పూనికతోనే అవన్నీ మొదలైపోయాయని ప్రజలు కూడా అనుకోరు. ఇంత త్వరగా ఒక ఫ్యాక్టరీ నిర్మాణం జరగదనే సంగతి ప్రజలకు కూడా తెలుసు. అయితే ఆయన చెబుతున్నట్టుగా ఆరునెలలనుంచి ఏడాదిలోగా పూర్తయి ప్రారంభానికి సిద్ధమైపోతాయని అంటేకూడా ప్రజలు నమ్మరు. మహా అయితే ఇప్పుడు శంకుస్థాపన చేసిన వాటిలో ఏమైనా జగన్ సర్కారు ఒప్పందాలు ఉండవచ్చు. కనీసం ఆ మాత్రం క్రెడిట్ అయినా దక్కించుకోవాలంటే.. గుడివాడ ఒప్పందపత్రాలు సహా బయటపెడితే తప్ప పరువు దక్కదు.
గుడివాడ ఒక విషయం తెలుసుకోవాలి. చంద్రబాబునాయుడు అంటే జగన్మోహన్ రెడ్డి కాదు. ఒకవేళ జగన్ హయాంలో ఏర్పాటు అయిన పరిశ్రమలే అయినా ప్రభుత్వం మారిన తర్వాత వాటిని చంద్రబాబునాయుడు ప్రారంభిస్తారు. అదే జగన్మోహన్రెడ్డి అయితే.. చంద్రబాబు హయాంలో ఏర్పాటైన పరిశ్రమల ప్రారంభంలోగా తన ప్రభుత్వం వస్తే.. వారిని బెదరగొట్టి రాష్ట్రం నుంచే తరిమివేసేవాడు అని ప్రజలు అంటున్నారు.