ఆమె పాపం కూడా ఇప్పుడు పండుతుందేమో!

ఆమెకు అత్యంత అవినీతిమయమైన ఐఏఎస్ అధికారిగా చాలా అపకీర్తి ఉంది. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గతంలో అంటే రాజశేఖర రెడ్డి హయాంలో సాగించిన అనేక అరాచకాలకు ఆమె దన్నుగా నిలిచిందనే కీర్తి కూడా ఉంది. అందుకే..  రాష్ట్ర విభజన తర్వాత.. ఆమె తెలంగాణ కేడర్ కు కేటాయింపబడినప్పటికీ.. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఎంతో దగ్గరి సంబంధాలు కలిగిఉన్న జగన్మోహన్ రెడ్డి.. ప్రత్యేకశ్రద్ధ కనబరచి మరీ.. ఆమెను ఏపీ సర్వీసులోకి తీసుకున్నారు. తన పాలనలో ఆమెకు అత్యంత కీలకపదవులు కూడా కట్టబెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమె హవా తగ్గింది గానీ.. గతంలో చేసిన పాపాలు ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి. గతంలో హైకోర్టు కల్పించిన విముక్తి ఆమెకు తాత్కాలిక ఆనందాన్ని మాత్రమే మిగిల్చింది.

ఇప్పుడు ఆమె దందాల గురించి మూడునెలల్లోగా మళ్లీ ఫ్రెష్ గా విచారణ చేయాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించడం షాక్ కు గురిచేస్తోంది. ఆమె ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి. ఓబులాపురం మైనింగ్ కేసులో నిందితులందరికీ శిక్షలు కూడా ఖరారైన తర్వాత.. గతంలో ఈ కేసునుంచి డిశ్చార్జి అయిన ఆమెకు తాజాగా ఎదురుదెబ్బ తగిలింది.
ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు నిందితులకు శిక్షలు ఖరారుచేసిన  సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు. ఆమెను నిర్దోషిగా ప్రకటించిన సీబీఐ కోర్టు, గాలి జనార్దన రెడ్డితో పాటు పలువురు అధికారులకు ఏడేళ్ల వంతున శిక్షలు ఖరారుచేసింది. అయితే ఇదే మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారి వై శ్రీలక్ష్మి కూడా నిందితురాలుగా ఉండేవారు. గతంలో జగన్మోహన్ రెడ్డి రాజ్యం సాగుతున్న రోజుల్లో ఏపీ సర్వీసులోకి వెళ్లిన ఆమె హైకోర్టులో ప్రత్యేకంగా పిటిషన్ వేసి ఈ కేసు నుంచి డిశ్చార్జి అయ్యారు.

ఓబులాపురం మైనింగ్ కంపెనీకి లీజులు కేటాయించే వ్యవహారంలో అప్పట్లో పరిశ్రమలు వాణిజ్యశాఖ కార్యదర్శిగా పనిచేసిన ఆమె నిబంధనలను తుంగలో తొక్కి ఇతర నిందితులతో కలిసి కుట్ర చేశారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. క్యాప్టివ్ మైనింగ్ వంటి షరతులను అసలు మైనింగ్ లీజు జీవోలో చేర్చకుండా అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆమెపై ఫిర్యాదులున్నాయి. అయితే 2015 నుంచి తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఆమె న్యాయపోరాటం చేస్తూ వచ్చారు. చివరికి ఆమెకు 2022 లో ఉపశమనం లభించింది. ఆమెను కేసునుంచి డిశ్చార్జి చేశారు. కానీ.. సీబీఐ సుప్రీం కోర్టుకు వెళ్లడంతో అక్కడ విచారణ జరిగింది.
ఓఎంసీ మైనింగ్ కేసులో అసలు నిందితులందరికీ సీబీఐ కోర్టు శిక్షలను ఖరారు చేసిన వెంటనే.. ఈ అక్రమాల్లో శ్రీలక్ష్మి పాత్ర గురించి మూడునెలల్లోగా మళ్లీ విచారణ చేయాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆమెకు ఈసారి శిక్ష తప్పదేమో అనే అనుమానాలు పలువురిలో వ్యక్తం అవుతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories