వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే చాలా మంది నాయకులు రాజీనామా చేసి వెళ్లిపోయారు. నాయకులు వెళ్లిపోయారు. ప్రతి సందర్భంలోనూ వాళ్లు ఉన్నా పోయినా ఒక్కటే అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చారు. ‘ఉండేవాళ్లు ఉంటారు.. పోయేవాళ్లు పోతారు.. ఉండేవాళ్లే మనోళ్లు’ అంటూ జగన్ సన్నాయి నొక్కులు నొక్కేవారు. చివరికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. తనమీద ఉన్న అన్ని అవినీతి అక్రమార్జనల కేసుల్లోనూ ఏ2గా తనతో కలిసి భారం మోస్తున్న విజయసాయిరెడ్డి వెళ్లిపోయినప్పుడు కూడా జగన్ ఇలాంటి హేళన మాటలే మాట్లాడారు. అయితే ఇప్పుడు పార్టీ కి రాజీనామా చేసి వెళ్లిపోయిన మర్రి రాజశేఖర రెడ్డికి జవాబివ్వలేని దీనస్థితిలో ఉన్నారు.. అని ఆ పార్టీ కార్యకర్తలే అనుకుంటున్నారు.
ఎమ్మెల్సీ పదవికి రెండు రోజుల కిందటే రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్, ఇప్పుడు పార్టీకి కూడా రాజీనామా లేఖ సమర్పించారు. తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినందునే, అవమానాలకు గురిచేసినందునే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన జగన్ కు లేఖ రాశారు. అలాగే త్వరలోనే తెలుగుదేశంలో చేరబోతున్నట్టుగా కూడా స్పష్టం చేశారు.
మర్రి రాజశేఖర్ జగన్ మీద చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పగల పరిస్థితి అధినేత వద్ద ఉన్నదా? అనేది పార్టీ నాయకుల సందేహం. ఎందుకంటే.. 2019లో టికెట్ నిరాకరించి విడదల రజనిని పోటీచేయించినప్పటికీ.. బహిరంగ సభల్లోనే.. మర్రిని ఎమ్మెల్సీ చేసి, మంత్రిపదవి ఇస్తానని ప్రకటించారు జగన్. నాలుగేళ్ల తర్వాత గానీ ఎమ్మెల్సీ పదవి కూడా దక్కలేదు. మంత్రి పదవి అనేది జగన్ అసలు పట్టించుకోలేదు.
2024లో రజనిని అక్కడినుంచి మార్చినప్పటికీ.. టికెట్ ఆశించిన రాజశేఖర్ ను జగన్ ఖాతరు చేయలేదు. కావటి మనోహర్ నాయుడును తెచ్చారు. అతను ఓడిపోయిన తర్వాత.. చివరికి పార్టీ ఇన్చార్జిగా కూడా మర్రి రాజశేఖర్ ను నమ్మలేదు. తనను సంప్రదించకుండానే.. రజనిని మళ్లీ తీసుకువచ్చి ఇన్చార్జి చేయడంతో అలిగిన రాజశేఖర్ ఇన్నాళ్లకు తన రాజీనామా నిర్ణయాన్ని కార్యరూపంలో పెట్టారు.
వైసీపీలో కరడుగట్టిన జగన్ అభిమానులు కూడా మర్రి రాజశేఖర్ రాజీనామా విషయంలో.. జగన్ ను సమర్థించలేకపోతున్నారు. చిత్తశుద్ధి కలిగిన నాయకుడు వెళ్లిపోయేలా చేయడం జగన్ స్వయంకృతమే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆత్మగౌరవం కోసమే పార్టీని వీడుతున్నా అంటున్న మర్రి రాజశేఖర్ కు జవాబివ్వ గల స్థితిలో జగన్ లేరని వాంటున్నారు.