పివి సునీల్ కుమార్ గతంలో సీఐడీ చీఫ్ గా ఉన్న రోజుల్లో విచ్చలవిడిగా రెచ్చిపోయినందుకు పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయో ఇంకా ఊహకు కూడా అందడం లేదు. ఆయన అధికార దుర్వినియోగం, కక్షపూరితంగా వ్యవహరించడం, రాజ్యాంగాన్ని చట్టాల్ని నియమనిబంధనల్ని తుంగలో తొక్కి విచ్చలవిడిగా వేధించడం వంటి వ్యవహారాలకు సంబంధించి ఒకటీ రెండూ కాదు కదా.. అనేక కేసులు ఇప్పుడు ముప్పిరి గొంటున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత.. పాత ప్రభుత్వంలో పాపాలకు పాల్నడినవారికి వ్యతిరేకంగా గళం విప్పే వారు ఎక్కువయ్యారు. ఆ క్రమంలోనే అనేకమంది గతంలో పివి సునీల్ కుమార్ వలన తాము పడిన ఇబ్బందులను కూడా నివేదించుకుంటున్నారు. అప్పటికేసులను ఇప్పుడు విచారిస్తున్న పోలీసులు.. సునీల్ పాత్రపై పూర్తి ఆధారాలను నమోదు చేస్తున్నారు. తన సస్పెన్షన్ కూడా ఎక్స్‌టెండ్ అయిన తరువాత.. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పివి సునీల్ కుమార్ రాబోయే రోజుల్లో ఊపిరాడనంతగా కేసుల్లో ఇరుక్కుంటారనే అంచనాలు ప్రజల్లో రేకెత్తుతున్నాయి.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాజ్యం చేసిన కాలంలో.. పివి సునీల్ కుమార్ ఆయనకు నమ్మిన బంటు. సీఐడీ చీఫ్ పదవిలో చెలరేగిపోయారు. జగన్ ప్రభుత్వం మీద కించిత్తు విమర్శ చేస్తే చాలు.. సామాన్యులను, వృద్ధులని కూడా చూడకుండా వారి మీద అడ్డగోలు సెక్షన్లతో కేసులు నమోదు చేయడం.. అరాచకంగా అరెస్టులు చేసి తీసుకు వచ్చి వేధించడం అప్పటి సీఐడీ శాఖకు నిత్యకృత్యంగా మారాయి. కేవలం పోస్టులు గట్రా మాత్రమే కాదు.. జగన్మోహన్ రెడ్డికి కిట్టని ప్రతి ఒక్కరినీ తమ వేధింపుల పరిధిలోకి తీసుకురావడంలో ఆరితేరిపోయారు. జగన్ కళ్లలో ఆనందం చూడడం ఒక్కటే జీవితలక్ష్యంగా వ్యవహరించారు. ఇంత చేసినప్పటికీ.. జగన్ సునీల్ కుమార్ ను కూడా పూర్తిగా నమ్మలేదు. మధ్యలో ఆయన సేవలు రుచించక ఆగ్రహించి పక్కకు తప్పించారు. అప్పటికే చేసిన పాపాలన్నీ సునీల్ కుమార్ ను అంటిపెట్టుకునే ఉన్నాయి.
ఇప్పటి డిప్యూటీ స్పీకరు రఘురామక్రిష్ణ రాజుపై అప్పట్లో కస్టడీలో హత్యాయత్నానికి ప్రయత్నించారనే కేసు ఇప్పుడు విచారణ సాగుతోంది. ఆ హత్యాయత్నం వ్యవహారంలో సునీల్ కుమార్ దే ప్రధాన పాత్ర అని రఘురామ ఆరోపిస్తున్నారు. ఆ విచారణలో ఇంకా సునీల్ కు నోటీసులు ఇచ్చి పిలవలేదనా రఘురామ ఆరోపిస్తున్నారు. ఈలోగా ఆయన మీద మరిన్ని కేసులు ముసురుకుంటున్నాయి.
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని అనుచితమైన రీతిలో అరెస్టు చేసి హింసించారనే ఆరోపణలతో 2022లోనే ఫిర్యాదులు రాగా.. ఇప్పుడు ప్రభుత్వం వాటిని కూడా తిరగతోడుతోంది. అప్పట్లో వేధింపులకు గురైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సామాన్యులు, జర్నలిస్టులను పోలీసులు కలిసి వారి వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు. అందరి మాటలు కూడా సునీల్ కుమార్ దుర్మార్గపు పాత్రనే తెలియజెబుతున్నాయి. సునీల్ కుమార్ చుట్టూ అనేక కేసుల ఉచ్చు బిగుసుకుంటూ ఉన్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆయనను రఘురామ కేసులో విచారణకు పిలిచేలోగా.. మిగిలిన కేసులన్నీ కూడా ఉక్కిరిబిక్కిరి చేసేంతగా పెరుగుతాయని అంటున్నారు.