90లలో మణిరత్నం దర్శకత్వం వహించిన సూపర్ డూపర్ హిట్ సినిమా ఘర్షణ గుర్తుందా? పురాణకథను కాస్త సోషలైజ్ చేసి.. సవతి సోదరుల మధ్య ఘర్షణను అత్యంత అందంగా చిత్రీకరించారు మణిరత్నం. పెద్దభార్య కొడుకుగా ప్రభు, చిన్న భార్య కొడుకుగా కార్తీక్. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు, నిత్యం ఘర్షణ వాతావరణం.. వీరిద్దరి మధ్య రచ్చ కారణంగా ఆ కుటుంబ పెద్ద సతమతం అయిపోతుండడం ఇదంతా ఆ సినిమా కథ. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బూడి ముత్యాలనాయుడు ఇంట్లో అదే సినిమా కథ రిపీట్ అవుతోంది.
బూడి ముత్యాల నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడే. 2014, 2019 ఎన్నికల్లో ఆయన గెలిచారు. అయితే అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో చేపట్టిన బదిలీల్లో భాగంగా ఆయన అనకాపల్లి ఎంపీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాల్సి వచ్చింది. అసలే అనకాపల్లిలో ఎన్డీయే కూటమి తరఫున బలమైన అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీచేస్తున్నారు. ఎంపీగా తన నియోజకవర్గాన్ని చూసుకోవడమే ఆయనకు ఇబ్బందిగా ఉంది. అయితే ఆయన రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే నియోజకవర్గం తన చేజారిపోవడం లేదనే నిన్నటిదాకా అనుకున్నారు.
ఎందుకంటే ఆయన రెండో భార్య కుమార్తె ఈర్లె అనురాధకు అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అయితే తాజాగా ఆయన కుటుంబంలో ఘర్షణ సినిమా రిపీట్ కావడం మొదలైంది.
ఆయన పెద్ద భార్య కొడుకు రవికుమార్ తాజాగా తన నిరసన గళం వినిపిస్తున్నారు. సదరు రవికుమార్ కూడా ఇండిపెండెంటుగా అక్కడ నామినేషన్ వేశారు. వైకాపా నాయకుల అడుగులకు మడుగులొత్తే అధికార్లపై న్యాయపోరాటం చేయడానికే తాను పోటీచేస్తున్నట్టుగా రవికుమార్ చెబుతున్నారు. అసలే మాడుగుల నియోజకవర్గంలో విస్తృతంగా బంధుత్వ, స్నేహ సంబంధాలు ఉన్న బండారు సత్యనారాయణమూర్తిని తెలుగుదేశం అక్కడ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత… బూడి ముత్యాల నాయుడు పరిస్థితి క్లిష్టంగా మారింది. దానికి తోడు ఇప్పుడు తన సొంత ఇంట్లోనే ఘర్షణ సినిమా మొదలు కావడంతో.. ఈ సమస్యను గట్టెక్కడం ఎలాగా అని ఆయన తల పట్టుకుంటున్నారు. ఇన్ని తలనొప్పుల మధ్యలో ఆయన తన అనకాపల్లి ఎంపీ ఎన్నిక మీదనైనా కాన్సంట్రేట్ చేయగలరా? అనే చర్చ నడుస్తోంది.