రచ్చ రంబోలా చేసేస్తున్న మంచు మనోజ్!

మంచు మోహన్ బాబు కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఆస్తుల  మీద హక్కుల కోసం ఏర్పడిన తగాదా.. ఆ కుటుంబం పరువు మొత్తం బజార్న పడేసిన అతిపెద్ద వివాదంగా మారింది. ఇది మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు అయ్యేవరకు వెళ్లింది. ఆయన ఆస్పత్రి పాలయ్యేవరకు వెళ్లింది. ఏది ఏమైనప్పటికీ.. పోలీసులు మాత్రం ఆ వివాదం మొత్తం కేవలం కుటుంబ తగాదాగా తేల్చేశారు. వారి కుటుంబం మధ్యలో తేల్చుకోవాల్సిన విషయం అని నిర్ణయించారు.

అలాగని బౌన్సర్లను వాడుకుంటూ.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం పోలీసులు ఊరుకోరని హెచ్చరించారు. ఇదంతా అందరికీ తెలిసిన సంగతి కాగా.. ఆ వివాదం సద్దుమణగడానికి వీల్లేదని.. రచ్చ రంబోలా చేస్తూ ఉండాల్సిందేనని మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ డిసైడ్ అయినట్టుగా కనిపిస్తోంది. సంక్రాంతి సందర్భంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో ఉండే మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద మనోజ్ చేసిన హంగామా గమనిస్తే ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది.

మోహన్ బాబు యూనివర్సిటీ విషయంలో మంచు మనోజ్ కు ఎంట్రీ లేదని ఇప్పటికే మోహన్ బాబు తేల్చేశారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లే చంద్రబాబు కుటుంబం.. తమ యూనివర్సిటీ మీదుగానే వెళ్తారు కాబట్టి.. యూనివర్సిటీ వద్ద.. పెద్ద ఫ్లెక్సిలను కూడా మోహన్ బాబు యూనివర్సిటీ తరఫున ఏర్పాటుచేశారు. చంద్రబాబు, లోకేష్ లతో మంచు మోహన్ బాబు, విష్ణు కలిసి ఉన్న ఫోటోలతో ఫ్లెక్సిలు వేశారు. వీటికి పోటీగా మంచు మనోజ్ కూడా ఫ్లెక్సిలు వేయించుకున్నారు. అందులో కొన్నింటిని యూనివర్సిటీ సిబ్బంది తొలగించారు కూడా.

తీరా సంక్రాంతి పర్వదినం నాడు.. యూనివర్సిటీలోకి ప్రవేశించడానికి మనోజ్ భార్య మౌనిక సహా రావడం పోలీసులు అడ్డుకోవడం జరిగింది. తాతయ్య, నానమ్మల సమాధులు చూడాలంటూ మనోజ్ హైడ్రామా నడిపించారు. పోలీసులు వెంటఉండి అక్కడిదాకా తీసుకువెళ్లి పంపేశారు. ఆ తర్వాత.. నారా లోకేష్ ను మనోజ్ దంపతులు కలిశారు. 20నిమిషాలు గడిపారు. తమ కుటుంబ వివాదం గురించి మాట్లాడలేదని.. వివాద పరిష్కారానికి సాయం అడగలేదని, ఈ విషయంలో తానే స్వయంగా పోరాడుతానని మనోజ్  ఆ తర్వాత మీడియాకు వెల్లడించడం గమనార్హం.

చూడబోతే.. మంచు మోహన్ బాబు ప్రశాంతంగా కూర్చునే పరిస్థితి లేకుండా.. నిత్యం ఏదో ఒక రచ్చ చేస్తూ ఉండడమే మనోజ్ లక్ష్యం అన్నట్టుగా కనిపిస్తోంది. అందుకోసం ఆయన ఎంతకైనా తెగిస్తున్నట్టుగా ఉన్నారు. రేణిగుంట విమానాశ్రయంలో దిగిన దగ్గరినుంచి కాలేజీ వరకు పెద్ద ర్యాలీగా వెళ్లడం, తనను అడ్డుకోవడానికి కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా బౌన్సర్లను పెట్టారంటూ.. తాను మాత్రం బౌన్సర్లను వెంటబెట్టుకునే అక్కడకు వెళ్లడం.. ఇలాంటి పనులన్నీ మనోజ్ ఉద్దేశ్యాన్ని స్పష్టం చేస్తున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories