మలయాళ నటి సంయుక్త మీనన్ ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. నాలుగు రోజుల క్రితం ఆమెకు బాలీవుడ్ నుంచి కూడా పిలుపు వచ్చింది. అందుకే ఆమె ముంబైకి కూడా వెళ్లినట్లు సమాచారం.
అయితే ఆ విషయం గురించి పక్కన పెడితే.. తాజాగా ఆమె తీసుకున్న ఓ నిర్ణయం గురించి ఆమె మీద ప్రశంసలు కురుస్తున్నాయి. అది ఏంటంటే…నిస్సహాయులైన మహిళలకు అండగా ఉండేందుకు సంయుక్త ముందుకు వచ్చింది. సమాజంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు, వారు ఎదుర్కొంటున్న సమస్యలకు తన వంతు పరిష్కారం సూచించేందుకు, సహాయం అందించేందుకు ఆమె ఒక అడుగు ముందుకు వేసి శ్రీరామనవమి సందర్భంగా ఆదిశక్తి అనే ఒక సేవా సంస్థను స్థాపిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ సంస్థ ద్వారా మహిళలకు అనేక రంగాల్లో సహకారం అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఆమె ప్రకటించింది. మగవారితో సమానంగా మహిళలకు కూడా అవకాశాలు ఇస్తే, వారు కూడా అభివృద్ధి పథంలో నడుస్తారని, అలాంటి వారిని అభివృద్ధి పథంలో నడపాలనే లక్ష్యంతో ఈ ఆదిశక్తి సంస్థను స్థాపించినట్లు సంయుక్త వివరించింది.
సమాజంలో ఉన్న అన్ని వయసుల మహిళలకు ఈ సంస్థ ద్వారా చేయూత అందిస్తామని, విద్యా, ఉపాధి, శిక్షణ ఆరోగ్యం వంటి విషయాలలో మహిళలకు అండగా నిలుస్తామని చెబుతున్నారు. మహిళలు సైతం ఆత్మగౌరవంతో జీవించాలని, అన్ని రంగాల్లో తమ గొంతు వినిపించాలనేది తమ ఆదిశక్తి సంస్థ ఉద్దేశం అని సంయుక్త ఒక ప్రకటనలో పేర్కొంది.