అమరావతికి మహారాజయోగం!

2019 తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్మోహన్ రెడ్డి.. అమరావతి విషయంలో కాస్త ఆలసత్వం ప్రదర్శించి ఉంటే ఎలా ఉండేదో తెలియదు. చాలా వరకు నిర్మాణం పూర్తయిన పనులను కంటిన్యూ చేస్తూనే… నెమ్మదినెమ్మదిగా పనులు నడిపించి ఉంటే ఎలా ఉండేదో మనకు తెలియదు. అలాగే.. మూడు రాజధానులుగా ప్రకటన చేసిన తర్వాత.. అందులో అమరావతి కూడా ఒక భాగమే కాబట్టి.. అమరావతి పనులు తక్షణం ప్రారంభించాలని కోర్టు కూడా తీర్పు చెప్పింది పనులు చేస్తున్నట్టే నటిస్తూ.. ఆలస్యం చేస్తూ ఉంటే ఏమయ్యేదో కూడా మనకు తెలియదు. కానీ.. ఆయన అమరావతిని అస్సలు ఏమాత్రం పట్టించుకోకుండా, మరుభూమిగా మార్చేయడానికి చేసిన కుట్ర ఇప్పుడు ఆ ప్రాంతానికి, రాజధానికి వరంగా మారింది. సాధారణ నిర్మాణాల గురించి తెలిసిన వారు ఊహించలేనంత శరవేగంతో రాజధాని నిర్మాణ పనులను పూర్తి చేయడానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.

అమరావతి రాజధాని మొత్తం ఇప్పుడు కళకళ లాడిపోతోంది. ఇంకా వైభవస్థితికి రాలేదు. కానీ ఇన్నాళ్లూ పెరిగిన పిచ్చిమొక్కలతో అడవిని తలపిస్తూ ఉండిన ప్రాంతంలో ఏకంగా 94 పొక్లెయిన్లు శరవేగంతో జంగిల్ క్లియరెన్స్ పనులు చేస్తున్నాయి. చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసే లోగానే.. మొత్తం 25 ప్రాంతాల్లో జంగిల్ క్లియరెన్స్ పూర్తిచేసేసి మైదానాల్లాగా అందంగా తయారు చేయడానికి పనిచేస్తున్నారు.

అలాగే ఆగిన నిర్మాణాలను పూర్తిచేయడం మీద కూడా దృష్టి పెడుతున్నారు. సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ అమరావతి అన్ని ప్రాంతాలలోను పర్యటించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల క్వార్టర్లు, ప్రజాప్రతినిధుల నివాసాలను కూడా పూర్తిచేయబోతున్నారు. ఎన్జీవో క్వార్టర్లు కూడా పూర్తిచేయబోతున్నారు. సగం నిర్మాణం పూర్తయిన వాటన్నింటినీ ఏడాదిలోగా పూర్తిచేసి కేటాయింపులు కూడా చేసేస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. మౌలికవసతుల పనులు మీద ముందు దృష్టిపెట్టబోతున్నారు. రోడ్లను, డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ కేబులింగ్ తదితర పనులను ప్రణాళికా బద్ధంగా పూర్తి చేయబోతున్నారు. ముందు అవన్నీ పూర్తయితే..  ఆటోమేటిగ్గా.. ప్రధాన నిర్మాణాల పనులు వేగం పుంజుకుంటాయనేది ఒక అంచనాగా ఉంది.

మొత్తానికి జగన్ అయిదేళ్ల పాటు ఇసుమంతైనా పట్టించుకోకపోవడం వలన.. ఇప్పుడు అమరావతికి హఠాత్తుగా మహర్దశ పట్టింది. రెట్టించిన వేగంతో ఇక్కడ పనులు చేయించాలని.. అయిదేళ్ల వ్యవధిలో రాజధాని నగరానికి ఒక రూపు తీసుకురావాలని కూడా చంద్రబాబునాయుడు భావిస్తున్నట్టు సమాచారం.

Related Posts

Comments

spot_img

Recent Stories