కడప జిల్లా మొత్తం తన అడ్డా అని.. తన ప్రాబల్యానికి అక్కడ తిరుగు లేదని.. వైయస్ జగన్మోహన్ రెడ్డి అనుకుంటూ ఉంటారు. నిజానికి రాజశేఖర్ రెడ్డి అడ్డాగా ఉన్న కడప జిల్లా ఆయన కుటుంబానికంతటికీ కూడా కాదు, కేవలం తనకు మాత్రమే పెట్టని కోట లాంటిదని ఆయన భావిస్తూ ఉంటారు. అందుకే కడప జిల్లాలో విచ్చలవిడిగా చెలరేగుతూ ఉంటారు. అలాంటిది 2024 సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణమైన పరాభవానికి గురికాగా.. ఇటు కడప జిల్లాలో కూడా ఎన్నడూ లేనంతగా దెబ్బతింది. జగన్ ప్రాబల్యానికి గండి పడింది. అలాంటిది ఇప్పుడు కడప జిల్లాలో తన బలం విషయంలో జగన్మోహన్ రెడ్డికి ఉండగల నైతిక స్థైర్యానికి సవాలు విసిరేలా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ తొలి మహానాడును కడప జిల్లాలో నిర్వహించాలని నిర్ణయించారు. మే నెల 27, 28, 29 తేదీలలో మూడు రోజులపాటు కడప జిల్లాలో మహానాడు జరుగుతుంది.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత.. కడప జిల్లాలో ఎన్నడూ మహానాడు జరగనే లేదు. ప్రత్యేకించి రాష్ట్ర విభజన తర్వాత ఈ 10 ఏళ్ల వ్యవధిలో కేవలం ఒకే ఒక్కసారి 2016లో తిరుపతిలో మహానాడు జరిగింది. అంతకుమించి పదేళ్లలో రాయలసీమలో ఎక్కడా మహానాడు నిర్వహించనేలేదు. ఈ సమీకరణాలను అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఈసారి కడప జిల్లాలో మహానాడు నిర్వహించాలని తెలుగుదేశం పాలిట్ బ్యూరో సమావేశం నిర్ణయించింది.
మహానాడు కార్యక్రమాన్ని సాధారణంగా ప్రతి సంవత్సరం ఒక్కో ప్రాంతంలో ఒక్కో చోట నిర్వహిస్తూ ఉంటారు. అయితే గత ఏడాది ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతిన్న తర్వాత జగన్ సొంత జిల్లా కడపలో ఈసారి మహానాడు నిర్వహించాలని నిర్ణయించడం ఆయన నైతిక స్థైర్యాన్ని దెబ్బ కొడుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. కడప జిల్లాలో మహానాడు ఏ కొంచం సక్సెస్ ఫుల్ గా జరిగినప్పటికీ, అది జగన్మోహన్ రెడ్డి ప్రభావం తగ్గుతున్నందుకు ఉదాహరణ గానే కనిపిస్తుందని అందరూ అనుకుంటున్నారు. అదే అభిప్రాయాన్ని ప్రజలలో వ్యాప్తి చేయడానికి కడపలో జరగబోయే మహానాడు ను మరింత ఘనంగా విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇప్పటినుంచి సమరోత్సాహం కనబరుస్తున్నాయి.