సినిమా హీరో అల్లు అర్జున్ నిజంగానే లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ ఆయన మీద నమోదైన కేసును హైకోర్టు పూర్తిగా కొట్టేసింది. ఆయన మీద కేసు నమోదు చేసిన తీరే సక్రమంగా లేదని అభిప్రాయపడింది. ఫిర్యాదు చేసిన అధికారి వ్యవహారాన్ని ఆక్షేపించింది. హైకోర్టు తీర్పుతో అల్లు అర్జున్ కు ఒక తలనొప్పి వదిలిపోయినట్లయింది.
ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలింగ్ కు ముందు అల్లు అర్జున్ తన మిత్రుడైన, నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. సహజంగానే అర్జున్ వచ్చిన సమయంలో స్థానికులు, వారి అభిమానులు చాలా పెద్ద సంఖ్యలో అక్కడ గుమికూడారు. అల్లు అర్జున్ అక్కడ గుమికూడిన అభిమానులను ఉద్దేశించి అభివాదం చేశారు తప్ప ఎలాంటి రాజకీయ ప్రసంగం చేయలేదు. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డితో కలిసి ప్రజలకు కనిపించారు తప్ప ఆయనకు ఓటు వేయమని గాని, మరొక మాట గాని చెప్పనేలేదు.
అయితే పెద్ద సంఖ్యలో అభిమానులు గుమికూడటం అనేది ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమేనంటూ నంద్యాల రూరల్ తహసీల్దారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి ఇచ్చిన ఉత్తరువు పట్ల అవిధేయత చూపించినందుకు వారి మీద కేసు నమోదు అయింది. ఈ కేసును కొట్టేయాలంటూ అల్లు అర్జున్ మరియు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తమ మీద బనాయించిన కేసులో అర్థం లేదని వారి వాదనలు వినిపించారు.
తాజాగా తుది తీర్పు వెల్లడించిన హైకోర్టు ధర్మాసనం ఈ కేసును కొట్టేసింది. స్నేహితుడి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారే తప్ప అభిమానులను ఆయన ఆహ్వానించినట్లుగా ఆధారాలు లేవని.. జనం పెద్ద సంఖ్యలో పోగవటం ఆయన తప్పు కాదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. జనం పెద్ద సంఖ్యలో ఉంటే చెదరగొట్టవలసిన బాధ్యత అధికార యంత్రాంగానిది మాత్రమేనని, అల్లు అర్జున్ ను బాధ్యుడిని చేయడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలో కేసు నమోదు చేయడం మతిలేని చర్య అని వ్యాఖ్యానిస్తూ న్యాయమూర్తి కేసు కొట్టేశారు.
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధం అవుతోంది. చిత్ర బృందం మొత్తం ఆ హడావుడిలో నిమగ్నమై ఉన్నారు. పుష్ప 2 తెలుగు సినిమా చరిత్రలో ఎలాంటి కొత్త రికార్డులు నమోదు చేస్తుందా? అని అంచనాలు వేయడంలో అందరూ బిజీగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ మీద ఎన్నికల నియమ ఉల్లంఘన కేసు కొట్టి వేయబడడం వారికి పెద్ద ఊరట అని చెప్పాలి. అల్లు అర్జున్ అభిమాన శిబిరం ఈ హైకోర్టు తీర్పుతో మరింత ఉత్సాహంగా కనిపిస్తోంది.