కొందరు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని, ఆయన నీడలో ఉంటే రాజకీయంగా ఒక వెలుగు వెలుగుతామనే భ్రమలో ఆ పార్టీలో చేరారు. ప్రజాజీవితంలో ఉండాలనుకున్నారు. వ్యాపారాలను వదులుకుని వచ్చిన వారు కొందరైతే.. పెద్దపెద్ద స్థాయుల్లోని ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకుని వచ్చిన వారు కూడా ఉన్నారు. జనగ్మోహన్ రెడ్డి అందరితో ఆడుకున్నట్టుగానే వారితో కూడా ఆడుకున్నారు. ఆయన ఆటలు బెడిసి కొట్టి.. గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. జగన్ ను నమ్మి వచ్చిన వారిలో చాలా మందికి ఇప్పుడు దిక్కుతోచడం లేదు. జగన్ ముద్ర పడిన తర్వాత వేరే పార్టీల్లోకి వెళ్లగల అవకాశం వారికి లేదు. అవకాశాలు కుంచించుకుపోయాయి. అలాగని వైసీపీకి భవిష్యత్తు ఉంటుందనే నమ్మకం కూడా సన్నిగిల్లిపోతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి వారికి రాజకీయ సన్యాసం తీసుకోవడం తప్ప వేరే గత్యంతరం లేకుండాపోతోంది. ఆ క్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ కూడా .. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించేశారు.
ఏఎండీ ఇంతియాజ్ సీనియర్ ఐఏఎస్ అధికారి. ఆ పదవి నుంచి వీఆర్ఎస్ తీసుకున్నారు. ప్రజలకు ఏదో చేయాలనే ఆలోచన ఉన్న ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి పంచన చేరారు. కర్నూలు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా కూడా పోటీచేశారు. అయితే జగన్ పట్ల ప్రజల్లో వెల్లువలా ఉన్న వ్యతిరేకత ధాటికి ఆయన కూడా సోదిలో లేకుండాపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయనకు జ్ఞానోదయం అయినట్లుగా ఉంది.
‘నా బంధువులు, శ్రేయోభిలాషులు అందరితో చర్చించి రాజకీయాలకు దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చాను’ అని ఇంతియాజ్ తాజాగా ప్రకటించారు. ‘రాజకీయాలకు మాత్రమే దూరంగా ఉంటానని, ప్రజాసేవకు కాదని, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా, సాహితీవేత్తగా, మెరుగైన సమాజం కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన చెబుతున్నారు.
జగన్ మోహన్ రెడ్డి పార్టీలో చేరినందుకు పశ్చాత్తాపపడుతున్న వారిలో ఈయన పేరు కూడా చేర్చాలి. చాలా మంది రాజకీయాలనుంచి తప్పుకున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన కొందరు మాత్రం ఇతర పార్టీల్లో చేరారు. కానీ పార్టీలో ఉన్న చాలా మంది నాయకులు ఇప్పటికీ వేరే గతిలేక, అలాగని సన్యాసం తీసుకోవడానికి మనసొప్పక కొనసాగుతున్నారనే ప్రచారం ఉంది. వారంతా ఎప్పటికి రాజీనామాలు చేస్తారో చూడాలి.