లోకేష్  మాట: యువరక్తానికి కొత్త ఉత్తేజం!

సాధారణంగా ఏ పార్టీకి అయినా సరే.. అంతర్గత నిర్మాణం అనేది చాలా ముఖ్యం. పార్టీ ఎంత స్ట్రాంగ్ అనేది అంతర్గత నిర్మాణం వల్లనే తేలుతుంది. సారథులుగా ఉండే సెలబ్రిటీ నాయకుల క్రేజ్ కూడా ముఖ్యమే కానీ.. ఆ క్రేజ్ ని రాజకీయంగా పార్టీకి బలంగా మార్చడం అనేది ఒక పెద్ద విద్య. పెద్ద ప్రక్రియ. ఆ ప్రక్రియ అంతర్గత నిర్మాణం పటిష్టంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. అలాంటి నేపథ్యంలో పార్టీ అంతర్గత నిర్మాణం, నాయకత్వం పరంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించిన ఒక నిర్ణయం.. పార్టీ కేడర్ కు కొత్త ఉత్తేజం ఇచ్చేలాగా కనిపిస్తోంది. లోకేష్ ప్రకటించిన నిర్ణయం వలన పార్టీకి సారథ్యం వహించడం అనేది కేవలం కొందరు వ్యక్తులకు మాత్రమే పరిమితంగా అమలయ్యే వ్యవహారం కాదని.. పార్టీని నమ్ముకుని కార్యకర్తల్లో చిత్తశుద్ధి, కార్యదీక్ష ఉండే ప్రతి ఒక్కరినీ వరించగల అవకాశం అని అందరూ చర్చించుకుంటున్నారు.
మంత్రి నారా లోకేష్  తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో పలు కార్యక్రమాల నిమిత్తం పర్యటించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకరు రఘురామక్రిష్ణ రాజు నివాసంలో తెదేపా నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీలో రెండుసార్లు ఒక పదవిలో కొనసాగిన నాయకులు.. ఆ తర్వాత పైపదవికైనా వెళ్లాలి. లేదా, ఓ విడత ఖాళీగా అయినా ఉండాలి’ అనే కొత్త ఆలోచనను ప్రతిపాదించారు. ఈ మాట కార్యకర్తలకు కొత్త ఉత్సహాన్నిస్తుంది. పార్టీకి సారథ్యం వహించే కీలక పదవుల్లో చాలా చోట్ల కొందరు వ్యక్తులే కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ ఉంటారు. వారిని మార్చకపోవడానికి చాలా చాలా కారణాలు ఉండొచ్చు. కానీ.. తాము కూడా సారథ్యం వహించాలని, కీలకమైన బాధ్యతల్లో పార్టీకోసం పనిచేసి.. గుర్తింపు తెచ్చుకోవాలని, పార్టీని పటిష్టం చేయడానికి పాటుపడాలనే ఆరాటం చాలా మందిలో ఉంటుంది. అలాంటి వారికి వీనులవిందుగా అనిపించే మాట సాక్షాత్తూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నోటినుంచి రావడం విశేషం. అందుకే యువ నాయకులు ఈ మాటపై విశ్వాసం పెట్టుకుంటున్నారు.

లోకేష్ ఎంత గొప్పగా ఈ ప్రతిపాదన చేశారంటే.. రెండుసార్లు ఒక బాధ్యతలు చూసిన నాయకులు తప్పుకోవాలి, మరొకరికి అప్పగించాలి.. లాంటి మాటలతో ఏకపక్షంగా చెప్పడం లేదు. అలా చెప్పి.. ప్రస్తుతం రెండు టర్మ్స్ కు మించి బాధ్యతల్లో ఉండే నాయకులను నొప్పించడం లేదు. వారు పైపదవులకు వెళ్లాలి అంటున్నారు. లేదా ఒక టర్మ్ తప్పుకోవాలి అని అంటున్నారు.

ఇది అద్భుతమైన ఆలోచన ఇలా మధ్యమధ్యలో ఒక టర్మ్ కొత్త వారికి అవకాశం ఇస్తూ ఉంటే.. పార్టీ కార్యకర్తల్లో ప్రతిభగల వారు ఎవరో పార్టీకి కూడా అంచనా చిక్కుతూ ఉంటుంది. భవిష్యత్ పార్టీ నాయకత్వాన్ని మరింత దృఢంగా తయారు చేసుకోవడం సాధ్యం అవుతుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories