మీడియా ముందు మాట్లాడే అవకాశం వస్తే చాలు.. కనీసం ట్వీట్ చేసే మూడ్ వస్తే కూడా చాలు.. జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా రెడ్ బుక్ సంగతి ప్రస్తావిస్తారు. రెడ్ బుక్కు పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నదని జగన్మోహన్ రెడ్డి తన ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. అయితే సదరు రెడ్ బుక్ లో అసలు ఎవరెవరి పేర్లు ఉన్నాయో స్వయంగా ఆ బుక్ సృష్టికర్త నారా లోకేష్ వెల్లడించారు.
మంగళగిరి ఆలయం వద్ద ఒక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్.. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్లంతా రెడ్ బుక్ లో ఉన్నారని ప్రకటించారు. ఇంత స్పష్టంగా కాకపోయినప్పటికీ ఇంచుమించుగా ఇదే తరహా అర్థంతో ఎన్నికలకు ముందు నుంచి కూడా లోకేష్ చెబుతూనే ఉన్న సంగతిని మనం గమనించాలి. ప్రజా కంటకులుగా వ్యవహరిస్తున్న నాయకులు అధికారుల పేర్లను రెడ్ బుక్ లో రాస్తున్నట్టుగా లోకేష్ ఎప్పుడో చెప్పారు. లోకేష్ పదేపదే ఆ మాట చెప్పిన కొద్ది గత ప్రభుత్వ హయాంలో పాపాలకు పాల్పడిన వారికి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.
నిజం చెప్పాలంటే పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిలో కూడా అదే భయం వ్యక్తం అయింది. ఆ భయాన్ని ఆయన యే కొంచమైనా దాచుకోలేకపోయారు. అనేక సందర్భాలలో రెడ్ బుక్ పేరును ప్రస్తావించి ప్రభుత్వం అందరినీ భయపెడుతున్నదని, వేధిస్తున్నదని ఆరోపించారు. లోకేష్ మాత్రం చాలా నింపాదిగా రెడ్ బుక్ ను అసలు ఇంకా తెరవక ముందే.. జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారంటూ ఎద్దేవా చేయడం కూడా జరిగింది.
అయితే ఇప్పుడు లోకేష్ అధికారిక ప్రకటనతో రెడ్ బుక్ విషయంలో ఒక క్లారిటీ వచ్చిందని అనుకోవాలి. రెడ్ బుక్ పేరు చెప్పి భయపడేవాళ్లు తాము గతంలో ప్రజలను ఇబ్బంది పెట్టి ఉన్నాం అనే భయంతో ఉన్నట్టుగా మనం భావించాలి. ప్రజా కంటకులుగా వ్యవహరించని ఎవరి పేర్లు కూడా రెడ్ బుక్కులో ఉండవు అని కూడా మనం అర్థం చేసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గానీ, వారికి తొత్తులుగా వ్యవహరించిన అధికారులు కానీ, జగన్మోహన్ రెడ్డి గానీ రెడ్ బుక్ పేరు ప్రస్తావిస్తే.. వారికి లో లోపల తాము ప్రజలకు ద్రోహం చేశామనే భయం ఉన్నదేమో అని అనుమానించాల్సిన పరిస్థితి ఇది. ఇకమీదటైనా జగన్ ఈ విషయంలో మౌనం పాటిస్తారో.. ఆ వివేచన కూడా కోల్పోయి నిత్యం రెడ్ బుక్ మంత్రం పఠిస్తూ ఉంటారో వేచి చూడాలి!