విశాఖపట్టణం నగరానికి ఐటీ హబ్ గా మహర్దశ పట్టనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఐటీ కేంద్రంగా విశాఖను అభివృద్ధి పరచే ప్రయత్నాలకు శ్రీకారం దిద్దుకుంది. మంత్రి నారా లోకేష్ పూనికతో పదివేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించే భారీ ప్రాజెక్టు విశాఖలో ఏర్పాటుకానుంది. ఇక్కడ డెవలప్ మెంట్ షెంటర్ ను ఏర్పాటు చేసేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసు సంస్థ అంగీకారం తెలిపింది. మంత్రి లోకేష్ స్వయంగా ముంబాయి వెళ్లి అక్కడి టీసీఎస్ పెద్దలను కలిసి విశాఖలో సంస్థను ఏర్పాటుచేయాల్సిందిగా కోరిన రోజుల వ్యవధిలోనే ఈ నిర్ణయం వెలువడడం విశేషం. ఐటీ పరంగా విశాఖపట్టణం నగరానికి గత అయిదేళ్లు పరిపాలన కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని కొత్తగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం సరిదిద్దే చర్యల్లో ఇది కీలకమైన మలుపు అని చెప్పుకోవచ్చు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి ఏర్పడిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం విశాఖపట్నం నగరాన్ని ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అనేక చర్యలు తీసుకుంది. అక్కడ నూతనంగా నిర్మించిన ప్రభుత్వ భవనాలలో ఆఫీసులను ఐటీ కంపెనీలకు కేటాయించారు. అనేక ఐటీ కంపెనీలు విశాఖలో తమ తమ కార్యాలయాలు ఏర్పాటుచేసేందుకు ముందుకు వచ్చాయి. కార్యకలాపాలు కూడా ప్రారంభించాయి. విశాఖలో పూర్తి స్థాయి ఐటీ వికాసం కంటికి కనిపించేలోగా.. ప్రభుత్వం మారింది. విధ్వంసానికి తిరోగమనానికి పెట్టింది పేరుగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. విశాఖపట్టణాన్ని రాష్ట్రానికి ఎగ్జిక్యూటివ్ రాజధానిగా మారుస్తానంటూ కొత్త డ్రామా ప్రారంభించారు. అక్కడి ఐటీ కార్యాలయాలను ఖాళీ చేయించారు. ప్రభుత్వ భవనాలను అప్పటికే లీజుకు తీసుకున్న సంస్థలను అక్కడినుంచి వెళ్లగొట్టారు. ఆ భవనాలన్నీ ప్రభుత్వ కార్యాలయాల కోసం అవసరం అంటూ వారిని తరిమేశారు. కొత్తగా రావడానికి ఏర్పాటు చేసుకుంటున్న సంస్థలన్నీ కూడా వెనక్కు తగ్గాయి. మొత్తానికి ఐటీ వికాసం పరంగా విశాఖపట్టణం స్తబ్దతలోకి వెళ్లిపోయింది. అదే సమయంలో.. రాజధాని దిశగా కూడా జగన్ ఒక్క పనిచేయలేకపోయారు. అమరావతిని నాశనం చేసి.. విశాఖ డ్రామా ఆడాలనుకున్న ఆయన అహంకారానికి హైకోర్టు బ్రేకులు వేసింది. రుషికొండను గొరిగించి.. తన కుటుంబం నివాసం కోసం మూడు హర్మ్యాలు నిర్మించడం మినహా జగన్ విశాఖకు చేసిందేమీ లేకపోవడం విశేషం. ఈ నేపథ్యంలో.. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక నిజమైన ప్రగతి ఏమిటో విశాఖ వాసులకు చూపించే చర్యలు పునఃప్రారంభించింది.
ఇప్పటికే పలు ఐటీ సంస్థలు విశాఖ కేంద్రంగా కార్యాలయాలు తెరవడానికి ముందుకు వచ్చాయి. విశాఖలో ఉన్న అనువైన వాతావరణం, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలోనే అందుబాటులోకి రానుండడం ఇత్యాది అంశాలు వీరికి ప్లస్ పాయింట్ అవుతున్నాయి. ప్రస్తుతం ఐటీ డెవలప్ మెంట్ సెంటర్ తో పాటు ఇంకా అనేక పెట్టుబడులు పెట్టేందుకు టీసీఎస్ అంగీకారం తెలిపింది. ఇది జగన్ కుట్రలను పటాపంచలు చేస్తూ.. విశాఖ కోసం లోకేష్ సాధించిన విజయంగా పలువురు అభివర్ణిస్తున్నారు.