విశాఖపట్నం నగరాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించి ప్రజలను మాయ చేయడంలో గత ఐదేళ్లపాటు జగన్మోహన్ రెడ్డి కృతకృత్యులయ్యారు. ‘విశాఖ రాజధాని కాబోతున్నది’ అనే ప్రచారం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి తన అనుచరులతో వందల వేల కోట్ల రూపాయల విలువైన రియల్ ఎస్టేట్ దందా నడిపించారు. ఆక్రమణలు. భూకబ్జాలు. బెదిరింపులు, తదితర అరాచక పర్వాలతో విశాఖపట్టణం నగరవాసులు వణికిపోయే పరిస్థితిని వారికి చూపించారు. వీటన్నింటి ఫలితమే ఆ నగర పరిసరాలలో కూడా ఎక్కడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోవడం. జగన్.. మూడు ప్రాంతాల సమాన అభివృద్ధి అనే మాయమాటలు చెబుతూ విశాఖపట్నం రాజధాని అనే ఎర వేస్తే.. అసలు వాస్తవమైన అభివృద్ధి అంటే ఏమిటో విశాఖ నగరవాసుల స్వప్నాలు నెరవేరడం ఎలా జరుగుతుందో ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిరూపిస్తోంది. విశాఖపట్నం నగర అభివృద్ధికి నారా లోకేష్ భరోసా ఇస్తున్నారు.
ఎన్డీఏ కూటమి సర్కారు ఏర్పడిన నాటి నుంచి విశాఖపట్నంని రాష్ట్రానికే ఐటీ హబ్ గా తీర్చిదిద్దుతాం అని ప్రభుత్వ పెద్దలు పదేపదే ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. టిసిఎస్ వారి ప్రాజెక్టు కొన్ని నెలల వ్యవధిలోనే ఇక్కడ తమ కార్యకలాపాలను ప్రారంభించబోతోంది. అమెరికాలో కూడా పర్యటించి అనేక ఐటీ కంపెనీలను విశాఖపట్నం నగరానికి తీసుకువచ్చేలాగా మంత్రి నారా లోకేష్ ప్రాథమిక చర్చలు జరిపి వచ్చారు. గూగుల్ తో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు కూడా విశాఖపట్నం కేంద్రం గానే తమ కార్యకలాపాలను నడిపించబోతున్నాయి. ఏ రకంగా చూసినా సరే విశాఖపట్నం రాబోయే రోజుల్లో అసలైన అభివృద్ధిని చవిచూసే వాతావరణం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఎనిమిదవ తేదీన విశాఖపట్నంలో ప్రధానమంత్రి కార్యక్రమాలకు జరుగుతున్న ఏర్పాట్లను అధికారులతో సమీక్షించిన మంత్రి నారా లోకేష్ అక్కడి ప్రజలకు మరోసారి భరోసా అందిస్తున్నారు.
దేశంలోనే కీలకమైన ఐటీ దిగ్గజ కంపెనీలకు కేంద్రంగా విశాఖపట్నం త్వరలో ఆవిర్భవించబోతున్నదని ఆయన అంటున్నారు. విశాఖపట్నంనికి ఇంకా భారీ సంఖ్యలో ఐటి కంపెనీలు రాబోతున్నాయని లోకేష్ చెబుతున్నారు. ఉత్తరాంధ్రవాసులను జగన్ వంచించారని.. ఐదేళ్లుగా జరిగిన ప్రగతి లోటును ఎన్డీఏ సర్కారు తీరుస్తుందని లోకేష్ హామీ ఇస్తున్నారు. జగన్ పరిపాలన కాలంలో భారీ పరిశ్రమలు మాత్రమే కాకుండా విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసుకున్న ఐటీ కంపెనీలు కూడా అనేకం తరలిపోయిన సంగతిని లోకేష్ గుర్తు చేస్తున్నారు. మరొకవైపు నేవీ డే ఉత్సవాలలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముంబాయి తరహాలో విశాఖ నగర అభివృద్ధిని సాకారం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో… నారా లోకేష్ హామీలు కూడా కలిసి ఇక్కడి ప్రజలకు కొత్త ఆశలు పుట్టిస్తున్నాయి.