రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వారం రోజుల అమెరికా పర్యటనను పూర్తి చేసుకుని వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి సంస్థలకు ఎలాంటి పెట్టుబడుల స్వర్గధామంగా మారిపోయిందో, అమెరికాలోని కంపెనీల యజమానులకు తెలియజేయడమే లక్ష్యంగా నారా లోకేష్ టూర్ సాగినట్లుగా తెలుస్తోంది. ఈ పర్యటనలో అనేక దిగ్గజ కంపెనీల ప్రతినిధులు యజమానులతో లోకేష్ సమావేశం అయ్యారు. పెట్టుబడులతో తమ రాష్ట్రానికి వస్తే ఎలాంటి సదుపాయాలు కల్పించబోతున్నామో.. ఎలాంటి రాయితీలు ఇవ్వబోతున్నామో.. నైపుణ్యాలు కలిగిన మానవ వనరుల పరంగా రాష్ట్రం ఎంత అందుబాటులో ఉంటుందో.. అన్ని వివరాలను నారా లోకేష్ వారికి తెలియజేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన అమెరికా పర్యటన తక్షణ ఫలితాలు కుదుర్చుకునే తరహా కాదని, ఈ పర్యటన యొక్క అసలు ఫలితాలు మూడు నెలల తర్వాత తెలుస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఎందుకంటే గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన సంస్థ ఒకటి కూడా లేదు. సాధారణంగా ఉద్యోగాల ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు గతంలో నువ్వు ఎవరి వద్ద పని చేశావు అని అడుగుతారు. ఆ సంస్థ పేరు, అక్కడ పొందిన జీతం స్థాయిని బట్టి ఆ అభ్యర్థి మీద ఒక అంచనాకు వచ్చి ఇంటర్వ్యూ ప్రారంభిస్తారు. రియల్ ఎస్టేట్లో ఒక స్థలం అమ్మదలుచుకుంటే దాని పక్కపక్కన మరొక స్థలం అంతకు ముందు ఏ ధరకు అమ్ముడుపోయిందో వాకబు చేసి ఆ తర్వాత దీని విలువ పై ఒక నిర్ణయానికి వస్తారు. పెట్టుబడులు పెట్టే పరిశ్రమలు కూడా అంతే. ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించినప్పుడు, గతంలో వచ్చిన సంస్థలు ఏవి అనేది కచ్చితంగా గమనిస్తారు. ఆ కోణంలో చూసినప్పుడు- గత ఐదేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నది స్పష్టం. పారిశ్రామిక రంగాన్ని, ఐటీ రంగాన్ని పెట్టుబడులపరంగా జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారన్నది కూడా స్పష్టం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మారిన తర్వాత ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, ఇప్పుడు పెట్టుబడులకు స్వర్గధామం గా ఉన్నదని సంగతి తెలియజెప్పడానికి మాత్రమే నారా లోకేష్ అమెరికాలో పర్యటించారు.
ఇప్పుడు జరిపిన భేటీల ఫలితం 2025 జనవరిలో దావోస్ లో జరిగే పెట్టుబడిదారుల సదస్సులో తెలుస్తుంది. సూత్రప్రాయంగా పెట్టుబడులకు సానుకూలత వ్యక్తం చేసిన సంస్థలు దావోస్ సదస్సు నాటికి ఒప్పందాలతో సిద్ధమవుతాయని, పెట్టుబడులతో ముందుకు వస్తాయని ఆశిస్తున్నారు. ప్రస్తుత అమెరికా పర్యటనలో నారా లోకేష్ మైక్రోసాఫ్ట్, టెస్లా, అమెజాన్, ఎన్విడియా, ఆపిల్, గూగుల్ క్లౌడ్, పెరోట్ గ్రూపు తదితర అనేక సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యా రు. వీటిలో కొన్ని సంస్థలు సూత్రప్రాయంగా పెట్టుబడులకు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఒప్పందాలు దావోస్ సదస్సులోనే కుదిరి అవకాశం ఉంది.