జగన్ మోహన్ రెడ్డి జమానాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక వ్యక్తులందరూ కలిసి మూడున్నర వేల కోట్ల రూపాయల ముడుపులను కాజేసిన లిక్కర్ స్కామ్ లో ఇప్పటికి ఏడుగురు నిందితులు అరెస్టు అయ్యారు. రిమాండులో ఉన్నారు. ఒక్కొక్కరిని పోలీసులుకస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నకొద్దీ కొత్త కొత్త వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుల జాబితాలోకి మరింత మంది జత చేరే వాతావరణం కనిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను గమనిస్తే.. ఈ కేసులో అంతిమంగా విచారణలన్నీ పూర్తయ్యేదాకా, లేదా, కోర్టు తీర్పులు వెలువరించేదాకా, నిందితులు ఎవరికైనా సరే బెయిలు లభించడం అనేది అంత ఈజీ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.
లిక్కర్ కుంభకోణంలో ప్రస్తుతానికి అరెస్టు అయిఉన్న ఏడుగురిలో చివరిగా కటకటాలలోకి వెళ్లిన వారు కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయరెడ్డి! అరెస్టుకు ముందు వీరిద్దరూ కూడా.. పరారీలో ఉంటూ ఎంతటి హైడ్రామా నడిపించారో అందరికీ తెలుసు. తమ పేర్లు నిందితుల జాబితాలో చేర్చబడడం కంటె ముందే పరారీలోకి వెళ్లిన వీరు.. హైకోర్టులోను, సుప్రీం కోర్టులోను ముందస్తు బెయిలు పిటిషన్లు నడుపుతూ.. జారుకోవాలని భావించారు. హైకోర్టు ఆ పిటిషన్ ను తిరస్కరించిన తర్వాత.. సుప్రీంలో దాఖలు చేశారు. ఆ సందర్భంగా విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందే అని సుప్రీం హెచ్చరించిన నేపథ్యంలో వారు సిట్ ఎదుటకు వచ్చారు. తొలుత 16వ తేదీ వరకు వారికి అరెస్టునుంచి రక్షణ కల్పించిన ధర్మాసనం, ఆరోజున వారి బెయిలు పిటిషన్ ను తిరస్కరించిన వెంటనే వారిని పోలీసులు అరెస్టు చేశారు.
వారి బెయిల్ పిటిషన్ ను తిరస్కరించే తీర్పులో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా కీలకంగా ఉన్నాయి. ఆ వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తే.. మద్యం స్కామ్ కు సంబంధించినంత వరకు ముందుముందు నిందితులు ఎవ్వరికీ బెయిలు రాదేమో అని అనిపిస్తోంది. ఎందుకంటే.. 36 పేజీల ఆ తీర్పులో.. ‘ ఈ కేసును లాజికల్ ఎండ్ కు తీసుకువెళ్లాలంటే.. విచారణాధికారికా స్వేచ్ఛ ఉండాలని’ సుప్రీం వ్యాఖ్యానించింది. విచారణ ఇంకా అసంపూర్తిగా ఉన్న నేపథ్యంలో, ఇంకా పలువురి సాక్ష్యాలను ముందుపెట్టి నిందితులను ప్రశ్నించాల్సి ఉన్న సమయంలో.. వారికి బెయిలు ఇస్తే అది దర్యాప్తునకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని కోర్టు వ్యాఖ్యానించడం విశేషం. నిందితులను కస్టోడియల్ విచారణ చేయాల్సిన అవసరం కనిపిస్తోందని కూడా వ్యాఖ్యానించింది. సుప్రీం ఇంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత.. లిక్కర్ స్కామ్ లో నిందితులుగా అరెస్టు అయిన ఏ ఒక్కరికైనా సరే.. విచారణ పర్వం మొత్తం పూర్తయ్యేవరకు బెయిలు దొరకడం అసాధ్యం అని పలువురు భావిస్తున్నారు. నిందితులందరూ ఒకరితో ఒకరు లోపాయికారీగా ముడిపడి ఉన్నందున ఏ ఒక్కరు జారుకున్నా సరే.. విచారణ లంకె తెగిపోయే పరిస్థితి ఉన్నదని అనుకుంటున్నారు.