దాదాపు మూడున్నర వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అప్పనంగా స్వాహా చేసిన మద్యం కుంభకోణంలో తమ వ్యవహార సరళి ఎలా ఉండబోతున్నదో న్యాయస్థానాలు ఒకే రోజున రెండు తీర్పులతో స్పష్టం చేశాయి. ఈ కేసులో అసలు జరిగిన నేరం మోతాదు ఎంత? అసలు నేరస్తుల వాటా ఎంత? తెరవెనుకనుంచి నడిపించిన వారంతా ఎవరెవరు? వంటి సమస్త వివరాలు తేలేదాకా ఎలాంటి శషబిషలకు పోయేది లేదని న్యాయస్థానాలు స్పష్టమైన సంకేతాలు ఇచ్చాయి. ఒకేరోజున రెండు కోర్టులు ఇచ్చిన రెండు వేర్వేరు తీర్పులు ఒకే ఉద్దేశాన్ని స్పష్టం చేస్తున్నాయి. లిక్కర్ కేసు పూర్వాపరాలు మొత్తం లెక్క తేలవలసిందే అనేదే ఆ సంకేతం.
లిక్కర్ కుంభకోణంలో ప్రధాన నిందితుల్లో ఒకడు- తొలి రాజకీయ నాయకుడిగా అరెస్టు అయిన చెవిరెడ్డి భాస్కర రెడ్డి తాజాగా పెట్టుకున్న బెయిలు పిటిషన్ ను కూడా హైకోర్టు తిరస్కరించింది. అరెస్టు అయిన నాటినుంచి ఇప్పటికే ఆయన పలుమార్లు బెయిలు పిటిషన్లు వేశారు. ప్రతిదీ తిరస్కరణకు గురైంది. లిక్కర్ స్కామ్ నిందితులకు బెయిలు కోసం పిటిషన్లు వేయడం, భంగపడడం అనేది ఒక రివాజుగా మారిపోయింది. పూర్తి లెక్కలు తేలేవరకు ఎవ్వరికీ బెయిలు ఇచ్చే ఉద్దేశం లేదన్నట్టుగా హైకోర్టు వ్యవహారసరళి ఇప్పటికే పలుమార్లు నిరూపణ అయింది. కానీ.. జైల్లో ఉన్న 13 మంది ప్రతిసారీ పిటిషన్లు వేసుకుంటూనే ఉన్నారు. ప్రధానంగా రాజ్ కెసిరెడ్డి, ధనంజయరెడ్డి, క్రిష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, బూనేటి చాణక్య తదితరులు బెయిలు పిటిషన్లు మళ్లీ మళ్లీ తిరస్కరణకు గురవుతుండడం గమనించాల్సిన సంగతి.
అదే సమయంలో ఏసీబీ కోర్టు సోమవారం నాడు మరో కీలక తీర్పు వెలువరించింది. లిక్కర్ కుంభకోణంలో కీలక నిందితులుగా ఉంటూ ప్రస్తుతానికి పరారీలో ఉన్న మరో 12 మందిని అరెస్టు చేయడానికి నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ చేసింది. వీరందరూ దేశం దాటి వెళ్లినట్టుగా ప్రస్తుతానికి అనుమానిస్తున్నారు. వీరిలో చాల మంది దుబాయిలో తలదాచుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నాు. మొత్తానికి ఇప్పుడు ఏసీబీ కోర్టు ద్వారా నాన్ బెయిలబుల్ వారంట్లు రావడంతో.. వాని పేర రెడ్ కార్నర్ నోటీసులు జారీచేసి అరెస్టులు చేసే ప్రయత్నాలు పోలీసులు ప్రారంభించనున్నారు.
ఈ రెండు తీర్పుల ద్వారా ఒక్క విషయం స్పష్టం అవుతోంది. లిక్కర్ కేసు ఫైనల్ గా తేలే వరకు జైల్లోకి వెళ్లే వారు ఉంటారే తప్ప.. జైలునుంచి బయటకు వచ్చే వారు ఉండరని అర్థమవుతోంది. అనేకమంది నిందితుల బెయిలు పిటిషన్లు పలుమార్లు తిరస్కరణకు గురికావడమే ఇందుకు ఉదాహరణ. ఈ కేసులో సిట్ ఇప్పటికే ప్రిలిమినరీ చార్జిషీటు దాఖలు చేసింది. మరికొన్ని వారాల్లోగా మరో చార్జిషీటు వేయడానికి సిద్ధం అవుతోంది. ఈలోగా మరికొందరు నిందితుల్ని అరెస్టు చేసి విచారిస్తే మరిన్ని ఆధారాలు సమకూరుతాయని సిట్ భావిస్తోంది. కాజేసిన సొమ్ము అంతిమలబ్ధిదారు అయిన బిగ్ బాస్ కు చేరిన వైనంపై కూడా స్పష్టమైన ఆధారాలు సిట్ వద్ద ఉన్నట్టుగా అమరావతి వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.