‘జైలు’ అన్న తర్వాత దానికి కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి. వాటిని గౌరవించడం అనేది ప్రాథమిక విధి. ఆ స్పృహే లేకుండా.. ఏదో మద్యం తాగి బార్లలో గొడవ చేసినట్టుగా, రాజకీయ సభల్లో యాగీ చేసినట్టుగా శృతిమించి అతి చేస్తాం అంటే కుదురుతుందా? కేవలం మీడియా దృష్టిని ఆకర్షించడానికి అలాంటి అతి చేసేవాళ్లను ఊరికే విడిచిపెట్టాలా? వారి మీద కేసులు పెట్టకుండా వదిలేస్తే.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయి కదా? ప్రభుత్వం మితిమీరిన ఉదారత్వంతో వ్యవహరిస్తున్నదని అంతా అనుకుంటారు కదా? ఇలాంటి శృతిమించిన సంఘటనలు భవిష్యత్తులో మరిన్ని చోటు చేసుకుంటాయి కదా? అనే చర్చ ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో నడుస్తోంది.
మూడున్నర వేల కోట్ల రూపాయలు దోచుకున్న లిక్కర్ కుంభకోణం కేసుల్లో వైసీపీ అక్రమార్కులకు తాజాగా మూడున్నర బెయిలు లభించిన సంగతి తెలిసిందే. ఎంపీగా పదవిలో ఉన్నాడు గనుక.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడం కోసం మధ్యంతర బెయిలు పుచ్చుకున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి లభించింది సగం బెయిలే అని చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఆయన 11వ తేదీ సాయంత్రానికి తిరిగి రాజమహేంద్రవరం జైలులో సరెండర్ కావాలని కోర్టు ఆల్రెడీ ఆదేశించింది. ఇకపోతే.. జాగన్ కు అత్యంత ఆత్మీయులు అయిన ముగ్గురు కీలక నిందితులు ధనంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలకు కూడా బెయిలు లభించింది. వీరి విడుదల ఆదివారం ఉదయం జరగాల్సి ఉండగా.. యుద్ధానికి వెళ్లి వచ్చిన మహావీరుల్ని రిసీవ్ చేసుకోవడానికి అన్నట్టుగా.. జైలు వద్దకు పెద్దసంఖ్యలో చేరుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడ నానా హంగామా చేశారు. మీడియా కనిపిస్తే చాలు.. ఏదో జరిగిపోతున్నట్టుగా నానా హడావుడి జరుగుతున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం అలవాటు చేసుకున్న ఈ నాయకులు.. జైలు బయట ధర్నాకు దిగడం, జైలు తలుపులను బద్ధలు కొట్టేయాలన్నట్టుగా వాటిని బాదుతూ లోపల మా నాయకుల్ని ఏం చేస్తున్నార్రా అని రంకెలు వేస్తూ నానా బీభత్సం సృష్టించారు.
ఈ ముగ్గురికి బెయిలు లభించింది. అయిదే ఆదివారం ఉదయం 8.30 నుంచి 10 గంటలలోగా ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని విడుదల చేస్తామని జైలు అధికారులు ముందే చెప్పారు. అయితే వైసీపీ నాయకులు తమ కార్యకర్తల్ని వెంటబెట్టుకుని ఉదయం అయిదున్నరకే జైలు వద్దకు చేరుకుని.. వెంటనే విడుదల చేయాలంటూ గొడవ ప్రారంభించారు.
ఎనిమిదిన్నరకు జైలు వద్దకు వస్తానని సూపరింటెండెంటు చెప్పడంతో ఈలోగా అధికారులు మిగిలిన ప్రక్రియ పూర్తి చేయసాగారు. అయితే బయట కార్యకర్తలు ఉన్న వైనం తెలుసుకున్న చెవిరెడ్డి భాస్కర రెడ్డి జైలు లోపలినుంచి డ్రామా షురూ చేశారు. ఆయన లోపల ఏదో జరిగిపోతున్నట్టుగా పెద్దఎత్తున అరవసాగారు. దీంతో బయటఉన్న వైఎస్సార్ కార్యకర్తలు వంత పాడుతున్నట్టుగా అరుస్తూ.. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు, జై జగన్ నినాదాలుచేస్తూ రభ చేశారు. నిజానికి తొమ్మిదిన్నరకే ఆ ముగ్గురుని విడుదల చేసినప్పటికీ.. అప్పటిదాకా.. మా నాయకుల్ని ఏం చేస్తున్నార్రా అంటూ జైలు సిబ్బంది మీదికి దూసుకెళ్లారు. అసలు జైలు గేటు దాకా కార్లతో గుంపులుగా రావడమే నేరం కాగా.. జైలు తలుపులు కొడుతూ యాగీ చేయడం ఇంకా ఘోరం.
ఈ చర్యను ఇలా వదిలేయకూడదని, తాము ఏం చేసినా చెల్లుతుందని చెలరేగుతున్న అల్లరి మూకల మీద కేసులు నమోదు చేయాలని జైలు అధికారులు కసరత్తు చేస్తున్నారు. బెయిలు విడుదలకు వచ్చిన సాకుతో.. వారు వ్యవహరించిన తీరును కోర్టుకు నివేదించాలని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.