వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయడమే తమ లక్ష్యం అని ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రకటించిన విషయమై రాజకీయ వర్గాల్లో ఇంకా చర్చోపచర్చలు సాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న అనేక మంది నాయకులు.. కమలదళంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని.. రాష్ట్రస్థాయి నేతలతో మంతనాలు సాగించుకుని.. బేషరతుగా పార్టీలో చేరడానికి సిద్ధపడుతున్నారని సమాచారం. వైసీపీకి రాజీనామా చేసిన రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా భాజపాలో చేరబోతున్నట్టుగా వస్తున్న పుకార్లను సోము వీర్రాజు మాటలు ధ్రువీకరించేలా ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఏపీలో వైసీపీలో ఉన్న నాయకులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. జగన్ మోహన్ రెడ్డి అనుచరగణంలో ఒకరిగా వెంటనడవడం అనేది వారికి నిత్యం ఆందోళనకరంగా కనిపిస్తోంది. సాధారణంగా దినదినగండం నూరేళ్లాయుష్షు అనే సామెత ఉంటుంది. కానీ.. వైసీపీ నాయకుల పరిస్థితి.. దినదినగండంగానే ఉంది.. అలాగని నూరేళ్లాయుష్షు కూడా గ్యారంటీ లేదు. ఇలాంటి సంశయంలో వారు సతమతం అవుతున్నారు. జగన్ దళంలో ఉంటే తాము ఎప్పుడు చేసిన పాపాలకు ఏం మూల్యం చెల్లించాల్సి వస్తుందో.. ఎప్పుడు పెట్టిన పోస్టులకు, ప్రెస్ మీట్లకు ఇప్పుడు కేసులు నమోదు అవుతాయో అనేది ఒక భయం. అలాగని.. జగన్ వెంట ఉండడం వల్ల రాజకీయ జీవితం స్థిరంగా ఉంటుందనే ఆశలేదు. ఆయన పార్టీని నడుపుతున్న తీరే.. దుకాన్ బంద్ దిశగా సాగుతోందనే భయం ఇంకోవైపు. పార్టీకి రాజీనామా చేసినా.. కేసులు విడిచిపెడతాయనే నమ్మకం వారికి లేదు. ఇన్ని భయాల మధ్య కూటమి పార్టీల వైపు చూస్తున్నారు. అయితే.. కూటమిలోనూ.. వీరిని చేర్చుకుంటే రాగల స్థానిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం, జనసేన తలుపులు బిడాయించి కూర్చున్నాయి. అంతో ఇంతో భాజపా మాత్రం వైసీపీ వారిని చేర్చుకోవడానికి సుముఖంగా ఉంది. విశాఖలో డెయిరీకి సారథ్యం వహించిన అడారి ఆనంద్ ను కూడా బిజెపి చేర్చుకుంది. అలాగే మాజీ ఎంపీ విజయసాయిరెడ్దిని కూడా చేర్చుకుంటారనే ప్రచారం జరుగుతోంది.
అయితే.. స్థానికంగా కూటమి పార్టీలకు ఇబ్బందికరంగా మారకుండా, వారికి పోటీవచ్చేలా పదవులు డిమాండ్ చేయకుండా ఉండేట్లయితే వైసీపీ నాయకులను బిజెపి చేర్చుకోవాలని అనుకుంటున్నట్టుగా విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి అభ్యంతరం లేదని సమాచారం. వారిని చేర్చుకుంటే శాసనసభలో తమ ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుందని.. వచ్చే ఎన్నికల నాటికి ఆ సీట్లను కూడా తమపార్టీకి ఇవ్వాలని కూటమిలో డిమాండ్ చేయవచ్చుననేది బిజెపి ఆలోచన.
ఇంకో పుకారు ఏంటంటే.. విజయసాయిరెడ్డి పలువురు వైసీపీ నేతలతో లోలోన చర్చలు సాగిస్తున్నట్టు గుసగుసలు ఉన్నాయి. ఆయన బిజెపిలో చేరేలోగా ఇంకా పలువురు నాయకులను ఒప్పించి.. అందరూ కలిసి ఒకేసారి చాలా ఘనంగా.. బిజెపిలో చేరాలనేది ప్లాన్ గా చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ముందే మేలుకుని.. విజయసాయితో ఎవరెవరు టచ్ లో ఉన్నారో చెక్ చేసుకోకుంటే.. త్వరలోనే ఆ పార్టీకి భారీగా గండి పడుతుందని అంటున్నారు.