అనంతపురం జిల్లా లేపాక్షి నాలెడ్జి హబ్ కు సంబంధించిన భూములు ఇప్పుడు ఈడీ ఆధీనంలో ఉన్నాయి. పారిశ్రామిక అవసరాలకు కేటాయించేందుకు ఉద్దేశించని ఈ భూములను జగన్ సర్కారు అనుచితమైన రీతిలో దందాలకు ఆశపడి కారుచవకగా కట్టబెట్టేయడంతో ఆ వివాదం కోర్టుకు వెళ్లింది. 8844 ఎకరాల భూమిని ఈడీ స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు చంద్రబాబునాయుడు సర్కారు.. ఆ భూమిని ఈడీ నుంచి తిరిగి ప్రభుత్వానికి తీసుకోవడం జరిగితే గనుక.. పారిశ్రామికీకరణ పరంగా అనంతపురం జిల్లా రూపురేఖలు మార్చేయవచ్చునని తలపోస్తున్నారు.
లేపాక్షి నాలెడ్జి హబ్ భూముల్లో పారిశ్రామిక హబ్ డెవలప్ చేయాలని అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత.. అన్ని పనులూ ఆగిపోయినట్టే ఇది కూడా ఆగిపోయింది. ఆ ప్రాజెక్టులో ఎమ్మెల్యే కొడుకు ఒకరు డైరక్టరుగా చేరిన తర్వాత భూములను సంస్థకు అప్పగించడం జరిగిందనే ఆరోపణలు కూడా అప్పట్లో ముమ్మరంగా వినిపించాయి.
ఇప్పుడు బాబు ప్రభుత్వం పారిశ్రామిక రంగంలో రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లాలని అనుకుంటోంది. రాష్ట్రంలో మొత్తం నాలుగు పారిశ్రామిక నోడ్ లు ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. ఇవి దొనకొండ, మూలపేట, కుప్పం, లేపాక్షి ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తారు. ఈ నోడ్ ల కోసం కేంద్రానికి అనుముల కోసం ప్రతిపాదనలు పంపగా అన్నింటికీ అనుమతులు వచ్చాయి. అయితే లేపాక్షి భూములు వివాదం కారణంగా ఈడీ వారి స్వాధీనంలో ఉన్నాయి.
అయితే లేపాక్షి హబ్ ప్రాంతంలో పారిశ్రామిక అవసరాల నిమిత్తం కేటాయించేందుకు హైకోర్టు అనుమతించింది. అయితే.. అక్కడ నిర్మాణాలు చేపట్టేందుకు కొన్ని నిబంధనలు పాటించాలని అంటోంది. ఆ భూములు ప్రస్తుతం ఈడీ స్వాధీనంలో ఉండడంతో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదు. ఎవరెన్ని చెప్పినా అవి ఈడీ వద్దనే ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తుదితీర్పు వస్తే.. తమ పెట్టుబడి మురిగిపోతుందనే భయంతో వారున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈడీ ఆధీనంలో ఉన్న భూములన్నీ ప్రభుత్వం తీసుకోవాలని అనుకుంటోంది. కేంద్రం ద్వారా ఇది సాధిస్తే ఘనవిజయం కింద లెక్క. కానీ రాష్ట్ర ముఖచిత్రం ఈ నాలుగు పారిశ్రామిక నోడ్ లతో మారిపోతుందని అనవచ్చు.