వాలంటీర్లను ఇంటింటికీ పంపి.. వారిద్వారా లబ్ధిదార్లను ప్రలోభాలకు గురిచేసి పింఛనర్లను దాదాపుగా భయపెట్టి జగన్ కు ఓటు వేయించుకునేలా చేసిన కుట్రలకు కొంత మేర అడ్డుకట్ట పడింది. వాలంటీర్ల ద్వారా పింఛను పంపిణీ జరగడానికి వీల్లేదని ఈసీ స్పష్టంగా ఆదేశించేసింది. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ప్రత్యామ్నాయ కుట్రలకు తెరతీస్తున్నారు. వాలంటీర్లను తమ పార్టీ తరఫున ఎన్నికల ఏజంట్లుగా నియమించుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే వాలంటీర్ల ద్వారా తలపెట్టిన కుట్రలను ఇప్పటికే అడ్డుకున్న మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ కుట్రలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
వాలంటీర్ల ద్వారా పింఛను లబ్ధిదారులను ప్రలోభ పెట్టడం ఇప్పుడు వైసీపీ వారికి అంత ఈజీ కాదు. అదే సమయంలో వారి ద్వారా డబ్బు పంపిణీ చేద్దామనుకున్న కుట్రలు కూడా కష్టమే. కానీ వారు కొత్త ప్లాన్ వేశారు. వారిని పోలింగ్ ఏజంట్లుగా నియమించుకోవాలని అనుకుంటున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒకరు వంతున ఇన్నాళ్లపాటూ లబ్ధిదార్లకు డబ్బు అందిస్తూ వచ్చిన వాలంటీర్లే ఇప్పుడు పోలింగ్ ఏజంట్లుగా బూత్ లలో కూర్చుంటే వచ్చే ఓటర్లతో వారికి పరిచయం ఉంటుందని, బూత్ లో కూర్చుని అయినా వారు, ఓటర్లలో లబ్ధిదార్లను ప్రభావితం చేయగలరని వైసీపీ కుట్రగా ఉంది.
ఒకవేళ వారు ప్రభుత్వం నుంచి వేతనాలు పొందుతున్నందున నిబంధనలు అడ్డు పడేట్లయితే.. వాలంటీరు పోస్టులకు రాజీనామా చేయించి ఏజంట్లుగా వాడుకోవాలని చూస్తున్నారు. వాలంటీరుగా రాజీనామా చేసేస్తే.. ఈ రెండునెలల పాటూ తామే జీతాలు ఇస్తామని, తమ పార్టీ తిరిగి అధికారంలోకి రాగానే మళ్లీ వాలంటీరు పోస్టులోనే నియమిస్తామని అభ్యర్థులు వారిని ప్రలోభ పెడుతున్నారు. కుప్పంలో ఈ మేరకు ఎమ్మెల్సీ మరియు ప్రస్తుత అభ్యర్థి అయిన భరత్ వాలంటీర్లతో చెబుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి కుటిలయత్నాలకు చెక్ పెడుతూ.. మరోవైపు సిటిజన్ ఫోరమ్ ఫర్ డెమాక్రసీ తరఫున నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈసీకి లేఖ రాశారు. వాలంటీర్లను గానీ, రాజీనామా చేసిన వాలంటీర్లను గానీ ఎన్నికల ఏజంట్లు గా కూర్చోడానికి అనుమతించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన ఈసీని కోరారు. వాలంటీర్లను కొనసాగిస్తామని అధికార పార్టీ చెప్పినా, ఆ వ్యవస్థలో కొద్ది మార్పులతో కొనసాగిస్తామని ప్రతిపక్ష పార్టీ చెప్పినా రెండూ తప్పే అంటున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఎట్టి పరిస్థితుల్లోనూ వాలంటీర్లుగా ఈ అయిదేళ్లలో పనిచేసిన ఏ ఒక్కరూ కూడా పోలింగ్ ఏజంట్లుగా ఉండకుండా చూడాలని అంటున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రతిపాదనకు అనుకూలమైన నిర్ణయం ఈసీనుంచి వచ్చినట్లయితే.. వైసీపీ కొత్త కుట్రలకు కూడా చెక్ పడినట్టే.