కూటమి ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తుంటే దానిని అడ్డుకోవాలి. మంచి జరగకుండా చూడాలి. రాష్ట్ర ప్రజలకు మేలు జరగకుండా చూడాలి..’ ఇదొక్కటే తన కుటిల లక్ష్యం అన్నట్టుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారా? అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. కంపెనీలు ఏపీకి రాకుండా తన అనుచరులతో 200 వరకు ఈమెయిల్స్ పంపినట్టుగా కొన్ని వార్తలు వస్తుండగా.. బనకచర్ల ప్రాజెక్టు కట్టవలసిన అవసరం లేదని జగన్ స్వయంగా చెప్పడం ప్రజల్లో ఇలాంటి అభిప్రాయానికి తావిస్తోంది. గోదావరిలో మిగులు జలాలు లేవు.. బనకచర్ల కట్టడం దండగ అని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి యొక్క అజ్ఞానాన్ని సరిదిద్దుతూ, పొరుగు రాష్ట్రానికి మేలు జరిగేలా మాట్లాడుతున్న ఆయన కుట్రలను ఎండగడుతూ ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఒకరేంజిలో ఫైర్ అయ్యారు.
రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి కూటమి ప్రభుత్వం సంకల్పిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు కట్టడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం ఉండకపోవచ్చు. ప్రభుత్వానికి కీర్తి వచ్చేస్తుందని ఆ ప్రాజెక్టు పని ప్రారంభం అయితే చాలు.. రాయలసీమలో కూడా తనకు ఠికానా లేకుండా పోతుందని ఆయన భయపడుతుండవచ్చు. కానీ, అందుకోసం ఆ ప్రాజెక్టు మీద విషప్రచారం చేయడం చాలా దుర్మార్గం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి మిగులు జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్న గణాంకాలను స్పష్టంగా చెబుతోంది. గత వందేళ్ల లెక్కలు తీసి.. ఏడాదికి సుమారు మూడువేల టీఎంసీలు వృథాగా సముద్రంలో కలుస్తున్నట్టుగా చెబుతున్నారు. అయితే తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ వక్ర ప్రయోజనాల కోసం దీనిని వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాటలు కూడా అచ్చంగా తెలంగాణ కుట్ర పార్టీల ప్రచారానికి ఊతం ఇచ్చే విధంగానే ఉన్నాయి. వారు మరింతగా రెచ్చిపోవడానికి ఆస్కారం కల్పిస్తున్నాయి. ఇది ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి ఏపీ రాష్ట్రం మీద చేస్తున్న కుట్ర.
అందుకే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. గోదావరి మిగులు జలాల గురించి అసలు జగన్ కు అవగాహనే లేదని అంటున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ నానా రాద్ధాంతం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో కూడా నిమ్మల క్లారిటీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును ఖచ్చితంగా 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించి తీరుతాం అని.. నీటి నిల్వ మాత్రం 41.15 మీటర్ల ఎత్తువరకు చేస్తామని అంటున్నారు. దీంతో ఈ విషయంలో కూడా వైసీపీ కుటిల ప్రచారాలు తేలిపోయినట్టు అవుతోంది.
జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టులు, అభివృద్ధి పరంగా తన ప్రభుత్వకాలంలో ఏమీ చేయకపోతే పోయారు.. కానీ..కూటమి ప్రభుత్వం ఎంతో మేలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే వాటికి కూడా మోకాలడ్డడం మంచిది కాదని ప్రజలు ఈసడించుకుంటున్నారు.