జగన్మోహన్ రెడ్డి ముఖ్యమైన కొన్ని సందర్భాల్లో తిరుమల వెకంటేశ్వరుని దర్శనానికి వెళ్లారు. ముఖ్యమంత్రిగా ఉన్న అయిదేళ్ల కాలంలో హోదాకు, స్థాయికి ప్రతీక గనుక.. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రతిసారీ తిరుమల వెళ్లి పంచ ధరిచి, కండువా వేసుకుని స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు. కానీ జన్మతః, ఆచరణతః క్రిస్టియను అయిన ఆయనలో హిందూత్వం పట్ల భక్తిగాని, వేంకటేశ్వరుని పట్ల విశ్వాసం గానీ ఉన్నాయా? ఉన్నట్టుగా ఆయన ఎన్నడూ నిరూపించుకోలేదు. స్వామివారికి వస్త్రాలు సమర్పణ కార్యక్రమాలన్నీ కూడా కేవలం తన అధికార దర్పం హోదా ప్రదర్శించే అవకాశంగా మాత్రమే చేస్తూ వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి.. తిరుమల దేవుడి ఆలయ సాంప్రదాయాలను, ఆగమవిధులను తన అధికార దర్పంతో దారుణంగా భంగపరిచారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి.. ఇవాళ్టి కూటమి ప్రభుత్వ నేతలను, వారి కుటుంబాలను చూసి.. భక్తి విశ్వాసాలు అంటే ఏమిటో తెలుసుకోవాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా.. తిరుమల వేంకటేశ్వరుని దర్శనానికి వెళ్లారు. తమ కుమారుడు మార్క్ శంకర్ సింగపూరులో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడడంతో, త్వరగా కోలుకోవాలని క్షేమంగా ఉండాలని ఆమె మొక్కుకున్నారు. నాలుగురోజుల్లో మార్క్ శంకర్ ఆరోగ్యం కుదుటపడడంతో సింగపూరు నుంచి పవన్ కుటుంబం స్వదేశానికి వచ్చిన వెంటనే ఆమె తిరుమలకు వచ్చారు. తిరుమలలో అడుగు పెట్టిన దగ్గరినుంచి ఆమె ప్రతి పనిని నిబంధనలకు అనుగుణంగా శాస్త్రోక్తంగా చూశారు. ఆమె జన్మతః క్రిస్టియను గనుక.. అన్యమతస్తులు సంతకం చేయాల్సిన డిక్లరేషన్ ఫారం మీద తొలుత సంతకం చేసిన తర్వాత.. విధ్యుక్తంగా వరాహస్వామిని తొలుత దర్శించుకున్నారు. మొక్కు చెల్లించుకునేందుకు ఆమె స్వామివారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి అన్నప్రసాదం వితరణకు ఒక రోజు మధ్యాహ్నం భోజనానికి సరిపడా విరాళం రూ.17 లక్షల రూపాయలను ఆమె తమ కుమారుడు మార్క్ శంకర్ పేరిట అందజేశారు. తరిగొండ వేంగమాంబ అన్నదానసత్రంలో తాను స్వయంగా పాల్గొని కొందరు భక్తులకు వడ్డించారు. అక్కడే అన్నప్రసాదం స్వీకరించారు. సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు.
చంద్రబాబునాయుడు కుటుంబం కూడా చాలా తరచుగా అన్నదాన సత్రంలో సేవలు అందిస్తుంటారు. ప్రతి సంవత్సరం ఒకరోజుకు సరిపడా అన్నదానానికి విరాళం ఇస్తుంటారు. అలాగే భువనేశ్వరి, బ్రాహ్మణి తదితరులు స్వయంగా అన్నదానసత్రంలో భక్తులకు వడ్డించే పనిలో కూడా పాల్గొంటూ ఉంటారు.
తాను క్రిస్టియను అయినప్పటికీ.. తిరుమలలో ఆగమ విధులను గౌరవిస్తూ డిక్లరేషన్ ఫారం మీద సంతకం చేయడానికి ఒప్పుకోని అహంకారపూరిత వ్యక్తి అయిన జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక్కసారైనా అన్నదాన సత్రంలో అన్నప్రసాదం స్వీకరించారా? అనేది ఇప్పుడు ప్రజలు అడుగుతున్న ప్రశ్న. ఆగమ శాస్త్రోక్తంగా సీఎం దంపతులు వచ్చి స్వామికి పట్టువస్త్రాలు సమర్పించాల్సి ఉండగా.. జగన్ అయిదేళ్లలో ఒ క్కసారి కూడా భార్య భారతితో కలిసి తిరుమలకు రానేలేదు. అన్నదాన సత్రంలో సేవలు చేయడం గానీ, టీటీడీకి ఒక్క రూపాయి అయినా సొంత డబ్బు విరాళం ఇవ్వడం గానీ ఇక ఊహకు కూడా అందని సంగతులు. అందుకే జగన్ చంద్రబాబు కుటుంబం, పవన్ కల్యాణ్ కుటుంబాలను చూసి బుద్ధి తెచ్చుకోవాలని ప్రజలు అంటున్నారు.