జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల సమాన అభివృద్ధి- మూడు రాజధానులు అనే విచిత్రమైన కాన్సెప్టును తెరమీదికి తీసుకువచ్చారు. అక్కడికేదో.. ఒక ప్రాంతం అభవృద్ధి కావాలంటే.. అక్కడ రాజధాని ఉంటే తప్ప సాధ్యం కాదన్న భ్రమను ఆయన కల్పించారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తే యావత్ ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని ఆయన ప్రగల్భాలు పలికారు. అది మొదలుగా విశాఖపట్టణంలో జగన్ దళాలు సాగించిన అరాచకాలు, భూకబ్జాలు అన్నీ గమనించి.. ఉత్తరాంధ్ర ప్రజలు జగన్ ప్రతిపాదనను ఎంత ఘోరంగా తిరస్కరించారో ఎన్నికల ఫలితాల్లో మనకు అర్థమైంది. అయితే విశాఖను రాజధానిగా చేయడం వెనుక.. మరొక అతి భయంకరమైన రహస్యం ఇప్పుడు లీక్ అయింది. అది తెలిస్తే జగన్ మరీ ఇంత దుర్మార్గంగా ఆలోచించారా అనే భయం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. జగన్ ముఖ్యమంత్రి అయిన సమయంలో ఆయన వద్ద ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా పనిచేసి, కొన్నాళ్ల తర్వాత ఆయన ఆగ్రహానికి గురై పక్కకు తప్పుకున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈ భయంకర రహస్యాన్ని బయటపెట్టారు.
మూడు రాజధానుల కాన్సెప్టు తెచ్చిన తర్వాత.. విశాఖఉక్కు పరిశ్రమను ఎత్తేసి, ఆ కర్మాగారానికి చెందిన 30వేల ఎకరాల్లో రాజధాని పెట్టేద్దాం అని జగన్ ఆలోచించారట. అది సాధ్యం కాదని, మంచి పద్ధతి కాదని ఎల్వీ సుబ్రమణ్యం చెప్పబోగా, స్టీల్ ప్లాంటు వల్ల విశాఖ మొత్తం కాలుష్యమయం అవుతోందని జగన్ వాదించారట. తాను చేసిన మంచి ఆలోచనకు అడ్డుపడవద్దని కూడా హెచ్చరించారట. ఎల్వీసుబ్రమణ్యం ఓ టీవీఛానెల్ ఇంటర్వ్యూలో ఈ సంగతులు వెల్లడించడం విశేషం.
ఒకవైపు అమరావతి ప్రాంతంలో రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 55 వేల ఎకరాలను రాజధాని నిర్మాణం కోసం ఇస్తే, అక్కడ చాలా వరకు ప్రభుత్వ భవనాలు ఒక దశవరకు నిర్మాణం కూడా జరిగిన తర్వాత.. వాటిని పట్టించుకోకపోగా.. విశాఖ ఉక్కును మూసేసి మరీ ఆ సంస్థకు చెందిన భూములు కాజేసీ అక్కడ రాజధాని కట్టాలని అనుకోవడం జగన్ చిత్రమైన దుర్మార్గ బుద్ధికి నిదర్శనం అని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ సంగతి కూడా ఎన్నికలకు ముందే బయటకు వచ్చి ఉంటే.. జగన్మోహన్ రెడ్డి పార్టీకి విశాఖ మరియు యావత్ ఉత్తరాంధ్రలో డిపాజిట్లు కూడా దక్కి ఉండేవి కాదేమో అని కూడా పలువురు అంటున్నారు.