నేరస్తుల్ని బట్టి నేతలు తెలివి పెంచుకోవాల్సిందే..!

ఆధునికత పెరుగుతున్న కొద్దీ ప్రజల తెలివితేటలు పెరిగిపోతున్నాయి. ప్రత్యేకించి వైట్ కాలర్ నేరాలు చేసే ప్రబుద్ధులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు. తాము చేసే నేరాలు సమస్తం మోసాలతో కూడినవి కాబట్టి తమను తాము గొప్పవారిగా చాటుకోవడానికి నానా తాపత్రయ పడుతున్నారు. తెలివితేటలు ముదిరిన ప్రతి నేరగాడు కూడా తనకు రాజకీయ అండదండలు ఉన్నట్టుగా ప్రొజెక్టు చేసుకోవడం ఈ రోజుల్లో చాలా సాధారణం అయిపోయింది. వాళ్ళ బెడద తప్పాలంటే నాయకులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. తమతో ఫోటో దిగడానికి ఎవరిని అనుమతిస్తే ఏం కొంపలు మునుగుతాయో అనే భయం ప్రతి వారినీ వెన్నాడుతోంది. ఈ విషయంలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తమ మంత్రివర్గ సహచరులను హెచ్చరిస్తున్నారు. పబ్లిక్ లో కార్యక్రమాలకు హాజరవుతున్నప్పుడు ప్రజలు వచ్చి తమతో ఫోటోలు దిగే సమయంలో అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. 

చెవిరెడ్డికి దగ్గరి వ్యక్తి, ఆయన దందాకు బినామీ అయిన వెంకటేష్ నాయుడు వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్ని ఒక కుదుపు కుదుపుతున్న సంగతి అందరూ గమనిస్తున్నదే. చెవిరెడ్డి అక్రమాల్లో కీలక భాగస్వామి అయిన వ్యక్తి చంద్రబాబుతో, లోకేష్ తో కూడా ఫోటోలు దిగడం చర్చనీయ అంశమే. చెవిరెడ్డి తో కలిసి కొలంబో పా రిపోయే ప్రయత్నంలో ఉండగా పోలీసులకు దొరికిన వెంకటేష్ నాయుడు గురించి వైసీపీ, సాక్షి ఎన్ని ఫోటోలు సేకరించి ప్రచారంలో పెట్టినా ప్రజలు నమ్మడం లేదు. కానీ ఇలాంటి ప్రచారాలు ఎప్పుడో ఒకప్పుడు నాయకుల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. అందుకే చంద్రబాబు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 

జగన్ రెంటపాళ్ల యాత్రలో రప్పా రప్పా ఫ్లెక్సీలు పట్టుకుని అరెస్టు అయిన రవితేజ తెలుగుదేశం క్రియాశీల సభ్యుడని తేలింది. జగన్ అభిమాని కేవలం ఇన్సూరెన్సు వంటి బెనిఫిట్స్ కోసం టీడీపీ లో చేరిన వైనం బయటికి వచ్చింది. అంటే పార్టీ క్రియాశీల సభ్యత్వాలు ఇచ్చే సమయాల్లో కూడా పార్టీలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట.

అలాగే వైట్ కాలర్ నేరాలు చేసేవాళ్ళు తాము హై ప్రొఫైల్ మనుషులుగా చాటుకోవడానికి ఇలాంటి అతి తెలివితేటలు ప్రదర్శించడం రివాజు. నాయకులతో ఫోటోలు దిగడం.. తాము ఎవరిని మోసం చేయాలని అనుకుంటున్నారో దానిని బట్టి ఆ ఫోటోలను వాడుకోవడం ఒక టెక్నిక్ గా అనుసరిస్తున్నారు. ఇలాంటి మోసగాళ్ల బారిన పడకుండా ఉండడం నాయకులకు సవాలే. ఇవాళ్టి రోజుల్లో నేరస్తుల తెలివితేటల్ని బట్టి నాయకులు కూడా తమ తెలివితేటలను అప్డేట్ చేసుకోవాల్సిందే అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories