ఆలస్యంగా గెంతారు.. అత్యాశలేకుండా ఉంటే బెటర్!

గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ తాజాగా తెలుగుదేశంలో చేరారు. మాజీ మంత్రి కూడా అయిన ఆయన అధికార పార్టీనుంచి చాలా ఆలస్యంగా గెంతు వేసినట్టు లెక్క. నామినేషన్ల పర్వం కూడా ముగిసిపోతున్న తరుణంలో ఆయన ఫిరాయింపు జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ తనను పట్టించుకోవడం లేదు కాబట్టి, అక్కడ తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు కాబట్టి మాత్రమే డొక్కా.. అటునుంచి ఇటు వచ్చారు. వచ్చినంత మాత్రాన ఇక్కడ తనకు పెద్దపీట వేయాలని ఆశపడకుండా ఉండాలని పలువురు తెలుగుదేశం నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

డొక్కా మాణిక్యవరప్రసాద్ తొలినుంచి కూడా స్థిరంగా ఎన్నడూ లేరు. రాజకీయాల్లో రాయపాటి సాంబశివరావును గురువుగా భావించే డొక్కా తొలుత కాంగ్రెసులో ఉన్నారు. మంత్రిగా కూడా చేశారు. తర్వాతి పరిణామాల్లో తెలుగుదేశంలోకి వచ్చారు. 2019 అధికార మార్పిడి తర్వాత ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వెళ్లారు. పార్టీ తాడికొండ ఎమ్మెల్యే ఉండవిల్లి శ్రీదేవిని లూప్ లైన్లోకి నెట్టిన తర్వాత.. డొక్కా కు కొన్నాళ్లు ఆ నియోజకవర్గం ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చింది. దానికి తగ్గట్టుగానే ఆయన అక్కడ టికెట్ ఆశించారు. టికెట్ల సీజను వచ్చేసరికి జగన్, మేకతోటి సుచరితకు కేటాయించారు జగన్. అప్పటినుంచి డొక్కా పార్టీ వ్యవహారాలకు దూరంగానే ఉన్నారు గానీ.. తాజాగా తెలుగుదేశంలో చేరారు.

అధికార పార్టీలో ఉంటూ.. పదవిలేకపోయినా సరే.. ఏదో ఒక ప్రయోజనం దక్కుతుందని అందరూ అనుకుంటారు. అలాంటిది డొక్కా తెలుగుదేశంలో చేరడం అంటే.. రాష్ట్రంలో ఈసారి అధికార బదలాయింపు ఉంటుందని, తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని అనుకోవడానికి సంకేతంగా భావించాలి. అదలా ఉండగా తిరిగి తెలుగుదేశంలోకి రాగానే.. ఆయనకు టికెట్ దక్కే అవకాశం ఇప్పుడు ఎటూ లేదు. అలాగని పదవులు ఆశిస్తూ కూర్చోరాదని పార్టీ వారు అంటున్నారు.

డొక్కా మాణిక్యవరప్రసాద్ సీనియర్ నాయకుడిగా గుంటూరు జిల్లాలో కొన్ని నియోజకవర్గాలను ప్రభావితం చేయగల స్థితిలో ఉంటారు. తెలుగుదేశంలో చేరినందుకు మొక్కుబడిగా ఉండకుండా, పార్టీ గెలుపుకోసం చిత్తశుద్ధితో పనిచేస్తే పార్టీకి మాత్రమే కాదు ఆయనకు కూడా ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories