అసలే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడిచేసిన కేసులో నిందితుడిగా ఉంటూ ఏ క్షణాన అరెస్టు కావాల్సి వస్తుందో అని భయపడుతున్న లేళ్ల అప్పిరెడ్డి తన భుజాల మీద ఉన్న బరువును తెలివిగా బొత్స మీదికి నెట్టేశారా? అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం శాసనమండలిలో సభాపక్ష నేతగా ఉన్న అప్పిరెడ్డి.. కొత్తగా ఆ పదవిలో నియమితుడైన బొత్స సత్యనారాయణ పేరును తానే సిఫారసు చేసినట్టుగా చెబుతున్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయ ఇన్చార్జిగా బొత్స నియామకం విషయాన్ని కూడా ఆయనే స్వయంగా ప్రకటించారు.
లేళ్ల అప్పిరెడ్డి గుంటూరు జిల్లాకు చెందిన కీలక నాయకుడు. జగన్ విధేయుడు. గతంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా కూడా చేశారు. 2019 సమయంలో గుంటూరు ఎంపీ టికెట్ ను ఆశించారు. అయితే జగన్ నుంచి ఆశాభంగమే ఎదురైంది. తొలుత కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ.. తర్వాత జగన్ ఆయనను బుజ్జగించి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. జగన్ జమానాలో దాదాపుగా రాష్ట్రంలోని ప్రతి కీలక పదవి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతల చేతుల్లోనే ఉండేది. అలాగే శాసనమండలిలో నాయకత్వ పదవిని లేళ్ల అప్పిరెడ్డి చేతుల్లో పెట్టారు. పార్టీ కేంద్రకార్యాలయ ఇన్చార్జిని కూడా చేశారు.
పార్టీ ఇటీవలి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత పరిస్థితులు అన్నీ ఒక్కసారిగా మారాయి. గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడిచేసిన కేసు లేళ్ల మెడచుట్టూ చిక్కుకుంది. అరెస్టు భయంతో ఆయన హైకోర్టు నుంచి ముందస్తు బెయిలు తెచ్చుకున్నారు. మండలిలో నాయకుడిగా ఈ సమయంలో పనికిరాని పదవిలో ఉన్నందుకు, అధికార పార్టీతో మరింతగా వైరం పెంచుకోవాల్సి వస్తుందని ఆందోళన చెందారో ఏమో ఆ పదవినుంచి తప్పుకున్నారు.
మండలి నాయకుడిగా కొత్తగా ఎమ్మెల్సీ అయిన బొత్స సత్యనారాయణను నియమించాలని తానే జగన్ కు ప్రతిపాదించినట్టుగా లేళ్ల చెబుతున్నారు. మరోసారి ఆలోచించుకోవాలని జగన్ సూచించినప్పటికీ కూడా..తానే సిఫారసుచేసి బొత్సకు ఆ పదవి ఇప్పించినట్టు చెబుతున్నారు. బొత్స సీనియరు గనుక ఆ పదవిని ఇప్పించారని అనుకోవాలా? లేదా, పార్టీ అధికారంలో లేనప్పుడు పనికిరాని పదవి ఎందుకని వదిలించుకున్నారా? అని ప్రజలు రకరకాలుగా అనుకుంటున్నారు.