జర్నలిజం అనే ముసుగు తొడుక్కుని ఉన్నాం కదా అని ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తిస్తే.. ఎదురుదెబ్బలు తప్పవనే సంగతి ఎంత కొమ్ములు తిరిగిన వారికైనా ఏదో ఒకనాటికి అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు పరిస్థితి కూడా అదే. సుప్రీం కోర్టు బెయిలు ఇవ్వడంతో గుంటూరు జైలు నుంచి విడుదల అయిన కొమ్మినేని శ్రీనివాసరావు.. సాక్షి టీవీ చానెల్ లో తాను ఇదివరలో నిర్వహిస్తూన్న కేఎస్సార్ లైవ్ షోను తిరిగి ప్రారంభించారు. అయితే ఈసారి కాస్త ఒళ్లుదగ్గర పెట్టుకుని, జాగ్రత్తలు తీసుకుంటూ ఆయన షోలు పునఃప్రారంభించడం విశేషం.
జర్నలిస్టుకు పూర్తిగా స్వేచ్ఛ- హక్కుగా ఉంటుంది. అలాగే, జర్నలిస్టు వ్యవహారాల పట్ల నిష్పాక్షికంగా ఉండాలనేది వారు పాటించాల్సిన బాధ్యత కూడా! అయితే చాలా మంది జర్నలిస్టులు తమ హక్కులగురించి పదేపదే వాదిస్తుంటారు తప్ప, నిష్పాక్షికత అనే బాధ్యత గురించి ఆలోచించరు. కొమ్మినేని శ్రీనివాసరావు కూడా అందుకు అతీతమైన వ్యక్తి కాదు. ఆయన షోలలో.. లైవ్ లో ఎవరైనా కాలర్స్ చేసినప్పుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నొప్పి కలిగేలా ఒక వ్యాఖ్య చేసినా, ఒక సహేతుకమైన వాదన వినిపించినా ఏ రీతిగా విరుచుకుపడిపోయేవారో ఆ షోను క్రమంతప్పకుండా ఫాలో అయ్యే అందరికీ తెలుసు. అదే సమయంలో.. చంద్రబాబునాయుడును, పవన్ కల్యాణ్ ను తిట్టడానికి, నిందించడానికి ఎవరైనా పూనుకుంటే ఏ రకంగా ఎంకరేజ్ చేసేవారో అందరికీ తెలుసు. అలాంటి వెకిలితనంతో కూడిన నిర్వహణ వల్లనే ఆయన ఇవాళ అరెస్టు అయ్యారు. అమరావతి వేశ్యల రాజధాని అంటూ ఒక గెస్ట్ జర్నలిస్టు నీచమైన వ్యాఖ్యలు చేసినప్పుడు కొమ్మినేని వెంటనే అడ్డుకుని ఉంటే.. ఆయనకు మర్యాద దక్కి ఉండేది. షో నిర్వహించిన కొమ్మినేని మీద, సాక్షి యాజమాన్యం మీద కూడా కేసు నమోదు అయింది.
ఆ అనుభవం వల్ల ఇప్పుడు ఆయన తన లైవ్ చర్చా షోను తిరిగి ప్రారంభించడానికి పూనుకోగానే.. డిస్క్లయిమర్ ప్రస్తావన తెచ్చారు. ఈ చర్చావేదిక షోలో అతిథులు వ్యక్తంచేసే అభిప్రాయాలతో, ఛానెల్ కు గానీ, కార్యక్రమం నిర్వహిస్తున్న యాంకర్ కు గానీ సంబంధం లేదని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే పునఃప్రారంభంలో తొలి షో నిర్వహిస్తూ.. వచ్చిన అతిథులను తనను పొగడడం కోసమే ఆయన ప్రోత్సహించారు. తనను కీర్తింపజేసుకున్నారు. ఇదంతా జరిగినప్పటికీ.. ప్రత్యేకించి ప్రతి ఒక్కరితోనూ.. కేసు విషయం ప్రస్తావించకుండా.. మీరు వివరాలు మాట్లాడండి.. అంటూ ఆయన అతి జాగ్రత్తలు తీసుకోవడం విశేషం.
ఇప్పుడు అరెస్టు అయి బెయిలు మీద బయటకు వచ్చారు గనుక.. వేడి చల్లారేదాకా జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే కాదు.. ఆయన లైవ్ షోలను నిర్వహించినంత కాలమూ ఇదే విచక్షణను పాటించాలి. అలాగే అతిథుల వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని చెప్పేసి చేతులు దులుపుకోవడం మాత్రమే కాదు. ఎవరైనా అతిథులు దుడుకు వ్యాఖ్యలు చేస్తే వారిపట్ల కఠినంగా వ్యవహరించి అడ్డుకోవడం కూడా తన బాధ్యత అని ఆయన తెలుసుకోవాలి.