కోనేటికి చీటీ చిరిగినట్టే : సత్యవేడుపై బాబు స్పెషల్ ఫోకస్!

సరిగ్గా ఎన్నికలకు ముందుగా .. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి తెలుగుదేశంలోకి వచ్చి టికెట్ దక్కించుకున్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు ఇక చీటీ చించేసినట్టే! తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా నాయకురాలిని లైంగింకంగా వేధించినట్టుగా వీడియో సాక్ష్యాలు సహా ఆరోపణలు రావడంతో.. కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన మీద చంద్రబాబునాయుడు పార్టీనుంచి సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. వీడియోలు ఎంత స్పష్టంగా ఉన్నాయంటే.. ఇక ప్రత్యేకంగా విచారణ కూడా అవసరం లేదని చంద్రబాబు అన్నట్టుగా తెలుస్తోంది. తమ పార్టీని నమ్మి సత్యవేడు ప్రజలు గెలిపించారు గనుక.. కోనేటి ఆదిమూలంను పక్కన పెట్టేసిన నేపథ్యంలో.. ఆ నియోజకవర్గ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని చంద్రబాబు స్వయంగా సూచించినట్టు అమరావతి వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తోంది.

సత్యవేడులో ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం చాలాపెద్ద పోటీనే నడిచింది. స్థానిక నాయకులు చాలా మంది టికెట్ ఆశించారు. అప్పటిదాకా పార్టీకోసం కష్టపడి పనిచేసిన వారికి టికెట్ కావాలని అనుకున్నారు. అయితే  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలం.. జగన్ తనకు టికెట్ నిరాకరించడంతో చంద్రబాబు పంచన చేరారు. సిటింగ్ ఎమ్మెల్యే కదా అనే ఉద్దేశంతో పార్టీ టికెట్ ఇచ్చింది. చంద్రబాబు మీద జనం నమ్మకం వెల్లువలా పనిచేయడంతో ఆయన కూడా గెలిచారు. తీరా ఇప్పుడు ఇలాంటి అసహ్యకరమైన పనితో భ్రష్టుపట్టారు.

పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీకోసం పనిచేసి అక్కడ గెలిపిస్తే.. ఎమ్మెల్యే ఇలా దారితప్పడం పట్ల చంద్రబాబు సీరియస్ అయినట్టు సమాచారం. పార్టీని నమ్మి గెలిపించిన ప్రజలకు ఎమ్మెల్యే లేడు అనే లోటు తెలియకుండా అభివృద్ధికి పూచీ తీసుకోవాలని ఆయన అనుకుంటున్నారట. కుప్పం తరహాలో అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. నియోజకవర్గం వ్యవహారాలను గమనించడానికి ప్రత్యేకంగా ఇద్దరు ఐఏఎస్ అధికారుల్ని నియమించి.. వారిద్వారా పార్టీ స్థానిక నాయకుల సమన్వయంతో.. అభివృద్ధిని నియోజవర్గంలో పరుగులు పెట్టించాలని తలపోస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే చేసిన తప్పు ప్రభావం నియోజకవర్గం అభివృద్ధి మీద పడకుండా.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి చంద్రబాబు మార్గదర్శనం చేస్తున్నట్టు తెలుస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories