వివాదాస్పద జర్నలిస్టు, సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు ఎట్టకేలకు జైలునుంచి బెయిలుపై విడుదల అయ్యారు. అమరావతి మహిళలను అవమానించేలా.. ‘అమరావతి వేశ్యల రాజధాని ’ అంటూ వ్యాఖ్యలు సాగిన కేసులో ఆ లైవ్ షో యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ సెక్షన్ల కింద అరెస్టు అయిన కొమ్మినేని బెయిలు కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించి ఊరట పొందారు. సుప్రీం ఉత్తర్వుల మేరకు మంగళగిరి కోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసింది. మొత్తానికి సోమవారం సాయంత్రం 6.50 గంటల సమయంలో ఆయన గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదల అయ్యారు.
కొమ్మనేనికి బెయిలు ఇవ్వాలని ఆదేశించిన సందర్భంలోనే సుప్రీం కోర్టు ఒక మెలిక పెట్టింది. ట్రయల్ కోర్టు విధించే నియమ నిబందనలకు లోబడి ఉండాలని షరతు విధించింది. ఆ మేరకు కేసు విచారిస్తున్న మంగళగిరి న్యాయస్థానం.. ప్రతినెలలో రెండు, నాలుగో శనివారాల్లో తుళ్లూరు పోలీసు స్టేషనుకు వచ్చి సంతకం చేయాలని, పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని, దేశం విడిచి వెళ్లాలంటే న్యాయస్థానం అనుమతి తీసుకోవాలని రకరకాల షరతులు విధిస్తూ ఆయనకు బెయిలు మంజూరు చేసింది.
కొమ్మినేని శ్రీనివాసరావు.. సాక్షి టీవీలో లైవ్ లో సాగే చర్చా కార్యక్రమానికి కేవలం యాంకర్ మాత్రమేనని, ఆ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు ఆయన జవాబుదారీ కాదని, ఆయనను అరెస్టు చేయడం తప్పు అని.. వాదించడం ద్వారా సాక్షి వర్గాలు, కొమ్మినేని న్యాయవాదులు ఆయనకు బెయిలు వచ్చేలా చేయగలిగారు. కానీ కొమ్మినేని ఆ యాంకర్ పాత్రలో చాలా అనుచితమైన రీతిలో వ్యవహరించేవారని అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. లక్ష్మీపార్వతిని స్టుడియోలో కూర్చోబెట్టి నిర్వహించిన కార్యక్రమంలో ఒక కాలర్ ఫోను చేసి ఆమె గురించి అనుచితంగా మాట్లాడబోగా.. కొమ్మినేని శ్రీనివాసరావు ఒక రేంజిలో రెచ్చిపోయారు. మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా? మీ భార్య కూతుళ్లను ఇలా అంటే ఊరుకుంటారా? బుద్ధుందా లేదా అంటూ చిందులు తొక్కారు. అదే సమయంలో.. అమరావతి గురించి అది వేశ్యల రాజధాని అంటూ జర్నలిస్టు కృష్ణంరాజు అతి నీచమైన వ్యాఖ్యలు చేస్తే వాటిని మాత్రం ఆయన ఖండించలేదు. సరికదా, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మిమ్మల్ని ట్రోల్ చేస్తారేమో అంటూ కృష్ణంరాజు మీదనే సానుభూతి చూపించారు. అమరావతి మహిళల ఆందోళనలు మిన్నంటిన తర్వాత కూడా కొమ్మినేనిలో కనీస పరివర్తన రాలేదు. అమరావతి మహిళల నిరసనల వల్ల తన యజమానులు నొచ్చుకుని ఉంటారేమో అని అందుకు జగన్ కు, భారతికి ఆయన క్షమాపణ చెప్పారే తప్ప.. అమరావతి మహిళలకు సారీ చెప్పలేదు. మొత్తానికి తన పక్షపాత ధోరణితోనే ఆయన అరెస్టు అయినట్టుగా పలువురు భావిస్తున్నారు. ప్రస్తుతానికి బెయిలు వచ్చినప్పటికీ.. ఈ కేసులో ఆయన శిక్ష తప్పదని కూడా పలువురు అంచనా వేస్తున్నారు.