ఏపీలో175 నియోజకవర్గాలలో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ప్రజలు ఆసక్తికరంగా గమనించేవి కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రఖ్యాత బూతు నేతలు ఇద్దరు పోటీచేస్తున్న గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. గుడివాడలో కొడాలి వెంకటేశ్వరరావు (కొడాలి నాని), గన్నవరంలో వల్లభనేని వంశీమోహన్ ఇద్దరూ కూడా మర్యాద తెలియని, సంస్కారం లేని బూతు రాజకీయానికి పేరుమోసిన నేతలు. ఈ ఇద్దరి విజయావకాశాల మీద ప్రజల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి ఉండడం సహజం. అయితే విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి ఈ ఇద్దరు నాయకులు కూడా ఖచ్చితంగా ఓడిపోబోతున్నారు! ఇక్కడ ప్రజలనాడి ఈ ఇద్దరు నాయకులకు వ్యతిరేకంగానే ఉన్నట్టు తెలుస్తోంది.
ఆప్తమిత్రులు అయిన ఈ ఇద్దరు నాయకులకు కొన్ని సారూప్యతలు ఉన్నాయి. ఈ ఇద్దరు నాయకులూ చంద్రబాబునాయుడు భిక్షతో రాజకీయ అరంగేట్రం చేసిన వారే! ఇద్దరూ రాజకీయ అరంగేట్రం తర్వాత ఇప్పటిదాకా ఓడిపోలేదు. ఇప్పుడు తొలిసారిగా.. తమను రాజకీయాల్లోకి తీసుకువచ్చిన తెలుగుదేశం చేతిలోనే ఓడిపోబోతున్నారు.
2004లో ఎంట్రీ ఇచ్చిన కొడాలి నాని రెండుసార్లు తెలుగుదేశం తరఫున, రెండుసార్లు వైసీపీ తరఫున గెలిచారు. 2014లో ఎంట్రీ ఇచ్చిన వల్లభనేని వంశీ రెండుసార్లు తెలుగుదేశం తరఫునే.. చాలా తక్కువ మెజారిటీలతోగెలిచారు. 2014లోఆయన మెజారిటీ 9.5వేలుకాగా, 2019లో కేవలం 838 ఓట్లు మాత్రమే. 2019 ఎన్నికల్లో వల్లభనేని వంశీని ఓటమి అంచులకు తీసుకువెళ్లిన ప్రత్యర్థి యార్లగడ్డ వెంకటరావు ఈసారి తెలుగుదేశం తరఫున పోటీచేస్తున్నారు. ఈ అయిదేళ్లలో వంశీ కూడగట్టుకున్న చెడ్డపేరు యార్లగడ్డకు భారీ మెజారిటీ అందించబోతున్నాయి. చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి గురించి వంశీచేసిన అసహ్యకరమైన వ్యాఖ్యలకు నియోజకవర్గంలోని యావత్తు ప్రజలంతా ఆయన ప్రవర్తనను ఈసడించుకుంటున్నారు. ఓడించి తీరాలనే పట్టుదలతో ఉన్నారు.
అదేవిధంగా గుడివాడలో కొడాలి నానికి, తెలుగుదేశం తరఫున వెనిగండ్ల రాము ప్రత్యర్థిగా ఉన్నారు. ప్రచారంలో గానీ, చివరకు డబ్బులు పంచడంలో గానీ ఎక్కడా తగ్గేదే లేదన్నట్టుగా వెనిగండ్ల రాము పోటీఇస్తున్నారు. కొడాలి నాని ఓటుకు రెండువేల వంతున పంచితే రాము రెండున్నర వేల వంతున పంచినట్టుగా కూడా స్థానికంగ వినిపిస్తోంది. పచ్చిబూతులు తిట్టడం ద్వారా మాత్రమే పాపులర్ అయిన నాయకుడు కొడాలి నానిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించి తీరాలని అక్కడ తెలుగుదేశం ఎంత పట్టుదలతో ఉన్నదో తెలుసుకోవడానికి అది ఉదాహరణ. గుడివాడ అంటేనే పేకాట క్లబ్బులకు, కేసినోలకు జూదానికి ప్రసిద్ధిగా దేశవ్యాప్తంగా పరువుతీసిన కొడాలి నాని పీడను వదిలించుకోవాలని నియోజకవర్గ ప్రజలందరూ కూడా గట్టి నిశ్చయంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.
మొత్తానికి ఈ బూతు నాయకులు ఇద్దరూ ఈఎన్నికల్లో తొలిసారి ఓటమి చవిచూడబోతున్నారు.