రైతుల మనసెరిగి.. ఆచితూచి అడుగులు!

అమరావతి విస్తరణకు చాలావరకు సానుకూల సంకేతాలే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి భూ సమీకరణకు ఆమోదం తెలియజేస్తూ కేబినెట్ తీర్మానం చేసిన తర్వాత.. వ్యవహారం ఊపందుకుంది. ఎమ్మెల్యేల సారథ్యంలో తొమ్మిది మండలాల పరిధిలో ముమ్మరంగా గ్రామసభలు పెడుతున్నారు. రైతుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. మెజారిటీ రైతులు భూములు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. అమరావతికి భూములిచ్చిన రైతులకు కల్పించే సదుపాయాలన్నీ, కొత్తగా భూములిచ్చేవారికి కూడా వర్తిస్తాయనడంతో చాలా మంది ముందుకు వస్తున్నారు.

అయితే కొందరు రైతులు మాత్రం కొన్ని భయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా భూసమీకరణ చేపడుతున్న ప్రాంతాల్లో తొందరపాటు అవసరం లేదని, ఏ ఒక్క రైతుకు కూడా ఏమాత్రం అసంతృప్తి కలగకుండా ఉండే విధంగా, అందరి అనుమానాలను నివృత్తి చేసిన తర్వాత మాత్రమే ముందుకు వెళదాం అని, పూర్తిస్థాయిలో రైతులను ఒప్పించాకే ముందుకు వెళదాం అని చంద్రబాబు సూచించినట్టు సమాచారం.

నిజానికి రెండోవిడత భూసమీకరణకు రైతులు చాలా ఉత్సాహంగానే స్పందిస్తున్నారు. అందుకే అధికారులు, నాయకులు ముమ్మరంగా గ్రామసభలను నిర్వహించడం ప్రారంభించారు. నిజానికి ఒకవైపు రాజధాని నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతూ ఉండగా.. సమాంతరంగా రెండో విడత కోసం భూసమీకరణ జరుగుతుండడం వలన ప్రభుత్వం మీద బాగా ఒత్తిడి కూడా పెరుగుతోంది. గ్రామ సభల్లో ఎక్కడైనా ఒకరిద్దరు రైతులు చిన్న అనుమానాలు వ్యక్తం చేసినా.. విపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు నానా రాద్ధాంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

నిజానికి అలా తమ పార్టీ సానుభూతిపరులైన కొందరు రైతులకు పురెక్కించి గ్రామసభలకు పంపుతున్నారు. వారి అనుమానాలను గురించి భూతద్దంలో చూపిస్తూ.. నానా యాగీ చేస్తున్నారు. మొత్తం మిగిలిన అన్ని గ్రామాల రైతులను కూడా భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు నిర్మాణ పనులు చూసుకోవడం మరోవైపు ఇలాంటి కుట్రలను భరించడం అన్నీ ప్రభుత్వానికి తీవ్రమైన ఒత్తిడి కలిగిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో భూసమీకరణ ప్రక్రియను నిదానంగా ముందుకు తీసుకువెళ్లవచ్చునని.. చంద్రబాబు సూచించినట్టుగా తెలుస్తోంది.
రైతుల్లోని అనుమానాలను పూర్తిగా నివృత్తి చేసిన తర్వాత మాత్రమే అడుగు ముందుకు వేయాలని ప్రభుత్వం సంకల్పించడం మంచి పరిణామమే అని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామసభలు హడావుడిగా కాకుండా.. మరింత నెమ్మదిగా నిర్వహించడానికి వీలవుతుందని అంతా అంటున్నారు. 

Previous article
Next article

Related Posts

Comments

spot_img

Recent Stories