విడదల రజని తరఫున వసూళ్లకేంద్రంగతా పనిచేసిన ఆమె మరిది గోపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2.2 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్న కేసులో అరెస్టు అయి ప్రస్తుతం రిమాండులో ఉన్న విడదల గోపీకి.. బెయిలు ఇవ్వడానికి హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో దర్యాప్తు ఇంకా పూర్తి కానే లేదని, లంచం సొమ్ము రికవరీ చేయాల్సి ఉందని.. ఏసీబీ తమ కౌంటర్లో పేర్కొంది. ఈ దశలో బెయిలు ఇవ్వడం వల్ల దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందని వ్యాఖ్యానిస్తూ హైకోర్టు బెయిలు పిటిషన్ ను తిరస్కరించింది. ఈ కేసులో విడదల గోపీ అంత సులువుగా బయటకు రాకపోవచ్చునని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
విడదల రజని.. జగన్ హయాంలో ఎమ్మ్యెల్యేగా గెలిచిన వెంటనే తన నియోజకవర్గంలో దందాలు ప్రారంభించేశారు. లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ వారిని పిలిపించి.. తనకు అయిదు కోట్ల రూపాయల ముడుపులు ఇస్తే తప్ప నియెజకవర్గంలో వ్యాపారం చేసుకోలేరంటూ బెదిరించారు. వారు కొంత ఆలస్యం చేసేసరికి.. సంబంధిత శాఖ వారికి వారు అక్రమాలు చేస్తున్నారని, తనిఖీలు నిర్వహించాలని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వారు స్పందించకపోయేసరికి అప్పటికి మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి.. ఆయన ద్వారా.. అధికార్లకు ఫోను చేయించి.. ఎమ్మెల్యే చెబితే కూడా చర్యలు తీసుకోరా.. అంటూ వారిని గదమాయింపజేశారు.
మొత్తానికి అప్పట్లో ఐపీఎస్ అధికారి జాషువా ఆధ్వర్యంలో పెద్ద బృందమే తనిఖీలు నిర్వహించింది. తనిఖీలను ఎక్కడా అధికారికంగా రికార్డుల్లో కూడా నమోదు చేయలేదు. కానీ.. ఆ తరువాత.. యజమానుల్ని జాషువా పిలిపించి.. మేడంతో సెటిల్ చేసుకోకుంటే 50 కోట్ల జరిమానా వేస్తానంటూ హెచ్చరించారు. చివరికి వారికి గతిలేక విడదల రజనితో మాట్లాడుకుని.. ఆమె ఆదేశం మేరకు 2కోట్ల రూపాయలు ఆమె మరిది విడదల గోపికి అందజేసి.. అదనంగా అతనికి పది లక్షలు, జాషువాకు పదిలక్షలు సమర్పించుకున్నారు.
ఆ కేసులో తొలుత విడదల గోపి అరెస్టు అయ్యారు. తాజాగా ఆయన బెయిలు కోసం పిటిషన్ వేసుకుంటే.. దానిని కోర్టు తిరస్కరించింది. ఆయననుంచి ఇంకా సొమ్ము రికవరీ కాలేదని, విచారణ కూడా పూర్తి కాలేదని, కేసు సంబంధిత మెటీరియల్ ను సీజ్ చేయాల్సి ఉందని అవేమీ జరగకుండానే బెయిలు ఇవ్వడం వల్ల దర్యాప్తకు ఆటంకం కలుగుతుందని వాదించడంతో కోర్టు ఆమోదించింది. బెయిల్ పిటిషన్ ను కొట్టేశారు. వదినమ్మ తరఫు దందాలకు కేంద్రబిందువుగా ఉండి ఆమె తరఫున పనిచేసినందుకు మరిదికి ఇప్పట్లో జైలునుంచి విముక్తి లభించేలా లేదు.