విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న “కింగ్డమ్” సినిమా చుట్టూ భారీ క్రేజ్ కొనసాగుతోంది. గతంలో ఈ సినిమా రిలీజ్‌ను పలు కారణాల వల్ల వాయిదా వేయడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా, యాక్షన్, ఎమోషన్ కలగలిపిన ఓ ఇంటెన్స్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. విజయ్ ఈ సినిమాలో పూర్తి భిన్నమైన గెటప్‌లో కనిపించనున్నాడు. ఇప్పటివరకు అతడు చేసిన పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో ఆయన నటన మరో స్థాయిలో కనిపించనుందని చిత్ర బృందం చెబుతోంది.
ఇక చాలా రోజులుగా ఎదురుచూస్తున్న రిలీజ్ డేట్ విషయాన్ని క్లారిఫై చేస్తూ, మేకర్స్ ఓ స్పెషల్ ప్రోమో ద్వారా రిలీజ్ డేట్‌ను రివీల్ చేయబోతున్నట్టు వెల్లడించారు. ఈ ప్రోమోను ఈరోజు సాయంత్రం 7.03కి విడుదల చేయనున్నారు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందో అనే విషయంపై తేలిపోయే అవకాశం ఉంది.
ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్యశ్రీ బొర్సె కథానాయికగా నటిస్తుండగా, సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నాడు. ఇక ఈ ప్రాజెక్ట్‌ను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ఉన్న అంచనాలు, క్యూరియాసిటీ చూస్తుంటే ఇది విజయ్ దేవరకొండ కెరీర్లో మరో మైలురాయిగా నిలవనుందని చెప్పవచ్చు.