గుంటూరు వెస్ట్ నుంచి తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యేగా గెలిచి.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిర్దాక్షిణ్యంగా వెళ్లిపోయిన మద్దాళి గిరిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి తెలుగుదేశంలో చేర్చుకోరాదని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. గుంటూరు నగర వైసీపీ అధ్యక్షుడుగా కూడా పనిచేసిన మద్దాళి గిరి.. తాజాగా పార్టీకి రాజీనామా చేసేయడంతో.. తెలుగుదేశంలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. గిరి టీడీపీవైపు చూస్తున్నారని వార్తలు వస్తుండగా పార్టీ కేడర్ మండిపడుతున్నారు. అవకాశవాదులు తిరిగి వస్తే చేర్చుకోరాదని అంటున్నారు.
మద్దాళి గిరి తెలుగుదేశం తరఫున గెలిచాన వైసీపీలోకి వెళ్లిపోయారు. అక్కడ పదవులు తీసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి టికెట్ నిరాకరించినప్పుడు కూడా ఆయన మేలుకోలేదు. పార్టీ గెలుస్తుందేమో ఇంకేదైనా లబ్ధి పొందుతూ బతకవచ్చునని అనుకున్నారు. నిజానికి జగన్ టికెట్లు నిరాకరించిన అనేకమంది సిటింగ్ ఎమ్మెల్యేలు అప్పుడే పార్టీకి రాజీనామా చేసేసి ఇతర పార్టీల్లో చేరారు. కొందరు తెదేపాలోకి, జనసేనలోకి వెళ్లినా.. అక్కడ అవకాశం లేకపోయినా సరే.. వైసీపీని వీడి కాంగ్రెసులో చేరిన వారు కూడా ఉన్నారు. కానీ.. మద్దాలి గిరి ఎంతటి అవకాశవాది అంటే ఆయన అసలు రాజీనామా చేయనేలేదు. జగన్ మళ్లీ గెలుస్తాడేమో అని ఎదురుచూస్తూ గడిపారు. ఇప్పుడు ఓటమి ఖరారయ్యాక.. జగన్ తన తీరుతో మళ్లీ గెలవబోయేది కూడా ఉండదని అర్థమైన తర్వాత.. ఇప్పుడు రాజీనామా చేశారు.
ఇంత ఘోరమైన అవకాశవాదుల్ని పార్టీలో చేర్చుకోవడం ఎప్పటికైనా పార్టీకి ప్రమాదకరం అని కార్యకర్తలు అంటున్నారు. సాధారణంగా చంద్రబాబునాయుడు.. ఇలాటి అవకాశవాదుల్ని తిరిగి తేర్చుకోవడం పట్ల ఉదారంగా ఉంటారనే అపకీర్తి ఉంది. పార్టీ బలంగా ఉండడమే ప్రయారిటీ అనుకునే చంద్రబాబు.. వెళ్లిపోయిన వాళ్లు మళ్లీ వచ్చినా చేర్చుకుంటారని అంటుంటారు. ఎన్నికలకు ముందు అయితే.. ఇలాంటి చేరికలు ఓకే గానీ.. గెలిచినప్పుడు మాత్రం మన చెంతకు వచ్చి, పార్టీ ఓడిపోయినప్పుడు పారిపోయే వారు వద్దనేది కేడర్ మాటగా ఉంది.
మరి మద్దాళి గిరి ఏ పార్టీలో చేరుతారో.. తెదేపా అధినేతనే ఒప్పిస్తారో.. లేదా,,. జనసేన, భాజపాలో చేరే అవకాశాన్నిఎంచుకుంటారో అని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఇకపై గిరి పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నారనే ప్రచారం కూడా వినిపిస్తోంది.