మాట నిలబెట్టుకుంటూనే.. ధరలు సవరించారు!


ఏపీలో లిక్కర్ ధరలను ప్రభుత్వం సవరించింది. దుకాణాలకు లైసెన్సులు తీసుకున్నవారు.. కొత్త లిక్కర్ విధానంలోని కొన్ని లోపాల వల్ల తమకు ఏమాత్రం మార్జిన్ మిగలడం లేదంటూ ప్రభుత్వం వద్ద మొరపెట్టుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దాదాపుగా అన్ని రకాల లిక్కర్ బ్రాండ్ల మీద రూ.10 వరకు ధర పెరిగింది. బార్లు ఇన్హౌస్ మద్యం మద్యం అమ్మకాలకు 15 శాతం పన్ను పెరిగింది. ఒకవైపు లిక్కర్ ధరలు పెంచవలసిన అవసరం ఏర్పడినప్పటికీ కూడా.. ప్రభుత్వం ఈ విషయంలో పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం గమనార్హం. రూ.99కే క్వార్టర్  లభించే మద్యం బ్రాండ్లు, బీరు ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా ప్రభుత్వం చర్య తీసుకుంది. ఖరీదైన మద్యం మాత్రమే ధర పెరుగుతుంది.

ఎన్డీయే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత.. కొత్త లిక్కర్ పాలసీ రూపకల్పనలో చిన్న తేడా జరిగినట్టుగా అధికారులు చెబుతున్నారు. లైసెన్సీలకు 20 శాతం మార్జిన్ ఇస్తామని మద్యం పాలసీలో ఉన్నప్పటికీ.. వాస్తవంగా 10 శాతమే మార్జిన్ దక్కేలాగా అది తయారైంది. ఈ విషయంలో లైసెన్సులు పొందిన తర్వాత.. వారికి అర్థం కావడంతో.. పాలసీ రూపొందించే సమయంలో అధికారులు అంచనాలు వేయడంలో జరిగిన పొరబాట్లు బయటపడ్డాయి. వ్యవహారం సీఎం దాకా వెళ్లింది. దాంతో ఇప్పుడు మార్జిన్ పెంచేందుకు కొత్త ఉత్తర్వులు వచ్చాయి.

వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో మద్యం ధరలను భారీగా పెంచేసి.. ప్రజలను ఎడాపెడా దోచుకున్నారు. చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచార సమయంలోనే.. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తాం అంటూ ప్రజలకు మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ మాట నిలబెట్టుకుంటూ.. క్వార్టర్ మద్యం ధర రూ.99కి మించకుండా విధానం తీసుకువచ్చారు. దీనిపట్ల మద్యం ప్రియుల్లో హర్షం వ్యక్తమైంది కూడా. దానికి తోడు.. జగన్ పాలన కాలంలో లాగా కేవలం జెబ్రాండ్ మాత్రం అమ్ముతూ ప్రజల ఆరోగ్యాన్ని కూడా గుల్ల చేయడం కాకుండా.. ప్రజలు ఇష్టంగా తీసుకునే అన్ని రకాల బ్రాండ్లను కూడా అందుబాటులో పెట్టారు.
పాలసీ రూపకల్పనలో తేడాలను సవరించేందుకు తాజాగా మద్యం ధరలను పెంచాల్సిన అవసరం వచ్చినప్పుడు.. తాను మాట ఇచ్చిన తక్కువ ధర మద్యం విషయంలో మార్పు ఉండడానికి వీల్లేదని చంద్రబాబు ఆదేశించారు. దాంతో.. రూ.99 కే క్వార్టర్ దొరికే మద్యం ధర పెరగలేదు. అలాగే బీర్ల ధరలు కూడా పెంచలేదు. కేవలం పెద్దస్థాయి లిక్కర్ ల ధరలు మాత్రమే పెంచారు. చంద్రబాబునాయుడు ధరలు పెంచాల్సిన అవసరం ఏర్పడినప్పటికీ కూడా.. అందులోనూ తన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories